సోమవారం, 10 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (12:19 IST)

ప్రదోష కాలంలో తులసి, కొబ్బరి నీళ్లు శివునికి ఇవ్వకూడదట!

Lord Shiva
శివపూజలో ప్రదోష కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. వ్యాస మహర్షి రచించిన శివ మహా పురాణం ప్రకారం సౌమ్య ప్రదోషం రోజు శివ పార్వతులను పూజించడం వల్ల మన మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. పరమేశ్వరుని పూజకు విశిష్టమైన ప్రదోష వ్రతం రోజున ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. ఈ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి, శుచియై శివ పార్వతులని మల్లెలతో పూజించాలి. 
 
శక్తి ఉన్నవాళ్లు ఉపవాసం ఉంటే చాలా మంచిది. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో సంధ్యా దీపం వెలిగించి నమస్కరించుకోవాలి. శివాష్టకం పఠించాలి. 
 
సంధ్యాసమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి, అభిషేకం, అర్చనలు జరిపించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు వంటివి శివునికి సమర్పించాలి. ప్రదోష వ్రతం రోజు శివలింగానికి తులసి, కొబ్బరి నీళ్లు, కుంకుమ సమర్పించకూడదు.