ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (10:49 IST)

తితిదే పురస్కారాలపై విమర్శలు.. అనర్హులకు అవార్డులు.. ప్రశంసాపత్రాలా?

అవార్డులు, పురస్కారాలు, ప్రశంసాపత్రాలు.. ఎంతో విలువైనవి. అది అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చేవి కావచ్చు. స్థానికంగా అందజేసేవి కావచ్చు. ఏదైనా అవార్డు, పురస్కారం ఇస్తున్నారంటే నానాటికీ దాని గౌరవం, ప్రతిష్ట పెర

అవార్డులు, పురస్కారాలు, ప్రశంసాపత్రాలు.. ఎంతో విలువైనవి. అది అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చేవి కావచ్చు. స్థానికంగా అందజేసేవి కావచ్చు. ఏదైనా అవార్డు, పురస్కారం ఇస్తున్నారంటే నానాటికీ దాని గౌరవం, ప్రతిష్ట పెరగాలి. అంతే తప్ప తగ్గకూడదు. సరైన అర్హులైన వ్యక్తులను ఎంపిక చేసి ఇవ్వడమే ఇందుకు మార్గం. ఒక అనర్హుడుకి ఇచ్చినా దాని గౌరవం తగ్గుతుంది. అందుకే ఎంపిక అత్యంత నిబద్ధతతో, పకడ్బందీగా జరగాలి. అంతేతప్ప అదేదో ప్రహసనంగా మారకూడదు. తితిదే వంటి ప్రతిష్టాత్మక సంస్థ అవార్డులు ఇచ్చేటప్పుడు మరింత జాగురూకతతో ఉండాలి.
 
తితిదే ఏటా ఆగష్టు 15వతేదీ స్వాతంత్ర్య దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేసి ప్రశంసాపత్రాలు అందజేస్తోంది. తమ ఉద్యోగ జీవితంలో ఒకసారైనా ఈ ప్రశంసాపత్రం అందుకోవాలని తితిదే ఉద్యోగులు కలలుకంటుంటారు. ప్రతి సంవత్సరమూ జాబితాలో తమ పేరు ఉంటుందేమోనని ఆశగా నిరీక్షిస్తుంటారు. తమ సేవను, నిబద్ధతను సంస్థ గుర్తించిందనడానికి ఆ ప్రశంసా పత్రాన్ని ఒక గీటురాయిగా భావిస్తుంటారు. అయితే ఇలాంటి ప్రశంసాపత్రాల కోసం జరుగుతున్న ఎంపిక తీరుపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తమవుతోంది. సంస్థ కోసం నిజంగా శ్రమిస్తున్న వారిని గుర్తించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
 
తితిదే ఉద్యోగుల అసంతృప్తి, ఆవేదన అర్థరహితమైనదేమీ కాదు. ఈ ఆగష్టు 15వ తేదీన ప్రశంసాపత్రాలు అందుకున్న వారి జాబితాను విశ్లేషించినా అనేక విషయాలు అవగతమవుతాయి. కొన్ని విభాగాల్లో పనిచేసే వారినే ఎక్కువగా అవార్డుల కోసం ఎంపిక చేస్తున్నారన్న విమర్శ ఉంది. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణమైన నిష్పత్తిలో ఎంపిక చేయడం లేదని చెబుతున్నారు. తితిదే మొత్తంగా 9,500 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సారి 202 మందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అంటే దాదాపు వెయ్యిమందికి ఇద్దరు లేక ముగ్గుర్ని ఎంపిక చేశారన్నమాట. ఈ నిష్పత్తిలోనే అన్ని విభాగాల నుంచి ఎంపిక జరగాల్సి ఉంటుంది. అయితే తిరుమల జెఈఓ ఆఫీసు నుంచి ముగ్గురిని, క్యాంపు ఆఫీస్‌ నుంచి నలుగురిని మొత్తం ఏడుగురిని ఎంపిక చేశారు. 
 
వందమంది కూడా పనిచేయని కార్యాలాయం నుంచి ఏడుగురిని ఎంపిక చేశారన్నమాట. అడిషనల్‌ ఎఫ్‌ఏ అండ్‌ సిఏఓ కార్యాలయం నుంచి 11 మందిని ఎంపిక చేశారు. ఇందులో సిఏఓ కార్యాలయం నుంచే 8 మంది ఉన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేసే వారిలో 15 మందిని అవార్డులకు ఎంపిక చేశారు. తితిదే అటవీవిభాగం నుంచి ఇద్దర్నీ, కళ్యాణకట్ట నుంచి నలుగురిని, ట్రాన్స్‌పోర్ట్ నుంచి ఇద్దర్నీ, ఈడిపీ నుంచి ఒకర్ని ఎంపిక చేశారు. ఈ సంఖ్యలే ఎంపికలో జరుగుతున్న అసమతుల్యతను తెలియజేస్తున్నాయి. ఉన్నతాధికారుల కార్యాలయాల్లో పనిచేసే వారికే ఎక్కువగా అవార్డులు లభిస్తాయనే ఆరోపణలకు ఈ లెక్కలే నిదర్శనంగా ఉన్నాయి.
 
అవార్డుల ఎంపిక చాలా యథాలాపంగా జరిగిపోతోందన్న విమర్శలూ ఉన్నాయి. విభాగాధిపతులు ఆ విభాగంలో పనిచేసే రిటైర్డ్‌మెంట్‌కు దగ్గరగా ఉన్న వాళ్ళనో, తనకు సన్నిహితంగా మెలిగే వారినో ఎంపిక చేసి పేర్లు అవార్డుల కమిటీకి పంపుతున్నారని చెబుతున్నారు. ఆ క్రమంలో మిగతా విషయాలను పట్టించుకోవడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. కొందరు 30 యేళ్ళ నుంచి పనిచేస్తున్నా ఎప్పుడో ప్రశంసా పత్రాలు లభించవు. అదే రెండుమూడేళ్ళ సర్వీసు లేని వారికి పత్రాలు లభిస్తున్నాయి. ఇదే చాలామంది సీనియర్‌ ఉద్యోగుల ఆవేదన. అవార్డులకు ఎంపిక చేసేటప్పుడు అన్ని కోణాల్లోనూ పరిశీలన చేయాలి. అయితే హెచ్‌ఒడిలు పంపిన జాబితాను యధాతథంగా ఆమోదిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అందువల్లనే ఒక్కోసారి అనర్హులకూ పత్రాలు దక్కుతున్నాయని అంటున్నారు. తిరుమల గోశాల అక్రమాలపై ఇటీవల పత్రిలకల్లో, టీవీల్లో కథనాలు వెల్లువెత్తాయి.
 
ఏనుగును అడ్డుపెట్టుకుని ఏటా అరకోటి దండుకున్న వైనాన్ని కళ్ళకు కట్టేలా కథనాలు ప్రసారం అయ్యాయి. దీనిపై స్పందించిన ఈఓ సాంబశివరావు చర్యలు తీసుకున్నారు. అలాంటి చర్యలకు గురైన వారికి ప్రశంసాపత్రం అందజేయడం ఏమిటి? అని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఉద్యోగుల బాగోగులను చూడాల్సిన అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కార్యాలయ సిబ్బందిని వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి అధికారికీ ప్రశంసా పత్రం ఇచ్చి వెండి డాలర్‌ మెడలో వేశారు. ఒక విభాగంలో ఎవరికైనా ప్రశంసాపత్రం ఇచ్చారంటే.. కనీసం ఆ విభాగంలో పనిచేసే ఉద్యోగులైనా దాన్ని ఆమోదించేలా ఉండాలి. వాళ్ళే వ్యతిరేకిస్తుంటే ఇక ఆ ప్రశంసకు అర్థం ఏముంటుంది? ఆవర్గీయులను ఎంపిక చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకుని వారి ట్రాక్‌ రికార్డ్ పరిశీలిస్తే చాలా వరకు అనర్హులను వడగట్టడానికి వీలవుతుంది. 
 
ఆగష్టు 15వ తేదీ ప్రశంసాపత్రాల అందజేత కార్యక్రమం కూడా గందరగోళంగా జరిగింది. త్రివర్ణ పతాక ఆవిష్కరణ కవాతు ఎంత క్రమశిక్షణాయుతంగా సాగిందో, అవార్డుల అందజేత కూడా అంత గందరగోళమైంది. తమ కుటుంబసభ్యుడు ఈఓ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ప్రత్యక్షంగా చూడాలని అవార్డు గ్రహీత బంధువులంతా అక్కడికి వచ్చారు. తీరా అవార్డు ఇచ్చేటప్పుడు ఆ దృశ్యం చూసే అవకాశం వారికి లేకుండా పోయింది. అంతా గుంపులు గుంపులుగా రావడం, వేదిక కూడా జనం తిలకించడానికి అనుకూలంగా లేకపోవడం ఇందుకు కారణం. దీంతో అక్కడికి వచ్చిన వారిలో నిరుత్సాహం కనిపించింది. జనవరి 26వ తేదీ నాటికి ప్రశంసా పత్రాలు ఇచ్చేటప్పుడైనా ఇందులోని లోపాలను సరిచేస్తారని ఆశిద్దాం.