శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 నవంబరు 2016 (11:33 IST)

కార్తీకమాసం ఆఖరి సోమవారం.. తెలుగు రాష్ట్రాల్లో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

కార్తీకమాసం ఆఖరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో భక్తులు దీపోత్సవాలు నిర్వహించి ఈశ్వరుడిని దర్శించుకుంటున్నారు. విజయవాడలోని కృష్ణానది దుర్గాఘాట్‌లో భక్

కార్తీకమాసం ఆఖరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో భక్తులు దీపోత్సవాలు నిర్వహించి ఈశ్వరుడిని దర్శించుకుంటున్నారు. విజయవాడలోని కృష్ణానది దుర్గాఘాట్‌లో భక్తులు తెల్లవారుజామునుంచే పుణ్య స్నానాలు చేశారు. అరటి దొప్పలలో దీపారాధనలు చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు.
 
కృష్ణాజిల్లాలోని కోడూరు మండలం సంగమేశ్వరం, మచిలీపట్నం మండలం మంగినపూడిలో తెల్లవారుజామున సముద్ర స్నానాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గుంటూరుజిల్లా బాపట్లలోని సూర్యలంక, ప్రకాశంజిల్లా చీరాల వాడరేవుల్లో భక్తులు సముద్ర స్నానాలు చేశారు.
 
శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. తిరుపతి కపిలతీర్థంలో భక్తులు బారులు తీరారు. తూర్పుగోదావరిజిల్లాలోని ద్రాక్షారామం వంటి పంచారామాల్లో భక్తులు కార్తీక మాస పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని శైవక్షేత్రాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.