1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (07:25 IST)

ఉస్మానియా వర్శిటీకి పూర్వ విద్యార్థి రూ.5 కోట్ల భారీ విరాళం

Osmania University
హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆధునిక తరగతి గదుల కాంప్లెక్స్ నిర్మాణానికి పూర్వ విద్యార్థి గోపాల్ టీకే కృష్ణ భూరి విరాళం ఇచ్చారు. ఏకంగా ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని అందజేశారు. 1968లో ఓయూలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ప్రస్తుతం అమెరికాలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, సెమినార్ హాల్‍‌కు ప్రో.వి.ఎం.గాడ్గిల్ ఆడిటోరియంగా, కమ్యూనిటీ హాల్‌కు ప్రొఫెసర్ అబిద్ అలీ పేర్లను పెట్టాలని కోరినట్టు చెప్పారు. 
 
విరాళం అందించిన కృష్ణను ఉస్మానియి విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ రవీందర్, ఇతర అధ్యాపక సిబ్బంది ప్రతేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రాల్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు విజయకుమార్, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. 
 
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం : ఎనిమిది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై ఆయన అనర్హత వేటు వేశారు. 
 
ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని ఇటు అధికార, అటు విపక్ష పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీరిలో వైకాపాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఉన్నారు. టీడీపీ తరపున కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్‌లను అనర్హులుగా ప్రకటించాలని ఆయా పార్టీలు కోరాయి. 
 
వీటిపై ఇటీవలే విచారణ చేపట్టిన తమ్మినేని సీతారాం... న్యాయనిపుణుల సలహా కూడా తీసుకున్నారు. ఆ తర్వాత సోమవారం రాత్రి మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే, టీడీపీకి చెందిన గంటా శ్రీనివాస రావు రాజీనామా వ్యవహారం న్యాయస్థానం పరిధిలో పెండింగ్‌లో ఉండటంతో ఆయన రాజీనామా ఆమోదంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది.