గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: హైదరాబాద్ , శనివారం, 24 ఫిబ్రవరి 2024 (20:32 IST)

చారిత్రక పీకేఎల్‌ పదో సీజన్‌ ట్రోఫీ వేటకు సర్వం సిద్ధం: సోమవారం నుంచి హైదరాబాద్‌లో ప్లేఆఫ్స్ పోటీలు

PKL 10th season trophy hunt
పన్నెండు వారాల హోరాహోరీ పోటీ తర్వాత లీగ్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లు సోమవారం నుంచి హైదరాబాద్‌లో జరిగే ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్‌ ప్లే ఆఫ్స్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. గచ్చిబౌలిలోని జీఎంసీలోని బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సోమవారం జరిగే రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లతో కబడ్డీ పీవర్ భాగ్యనగరాన్ని ఊపేయనుంది. పట్టికలో మూడో స్థానంలో నిలిచిన దబాంగ్ ఢిల్లీ కేసీ ఎలిమినేటర్‌‌-1 పోరులో ఆరో స్థానంలో ఉన్న పట్నా పైరేట్స్‌తో తలపడుతుంది. ఎలిమినేటర్ 2లో నాలుగో స్థానంలోని గుజరాత్ జెయింట్స్ ఐదో స్థానం సాధించిన హర్యానా స్టీలర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఈ నాలుగు జట్లు ఈ నెల 28, బుధవారం జరిగే సెమీ-ఫైనల్స్‌లో చోటు నువ్వానేనా అన్నట్టు తలపడునున్నాయి. లీగ్‌ దశలో సత్తా చాటి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన టేబుల్ టాపర్ పుణెరి పల్టాన్, రెండో స్థానంలోని జైపూర్ పింక్ పాంథర్స్ ఇప్పటికే సెమీ ఫైనల్స్‌లో చేరుకున్నాయి. ఎలిమినేటర్-1 విజేతతో పుణెరి సెమీస్‌లో పోటీ పడుతుంది. డిఫెండింగ్ చాంపియన్‌ జైపూర్ ఎలిమినేటర్-2లో నిలిచిన జట్టుతో తలపడుతుంది. మార్చి1, శుక్రవారం మెగా ఫైనల్ జరుగుతుంది.  
 
ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ చాలా ప్రత్యేకమైనదని లీగ్ కమిషనర్ అనుపమ్‌ గోస్వామి అన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశానికి హాజరైన అనుపమ్ ఈ సీజన్ గురించి మాట్లాడారు. ‘పీకేఎల్ పదో సీజన్‌ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నాలుగేళ్ల తర్వాత మేం మళ్లీ 12 ఫ్రాంచైజీల సొంత నగరాల్లో తిరిగి మ్యాచ్‌లు నిర్వహించాం. అలాగే, మా లీగ్ మ్యాచ్‌ల ప్రసారం, ఓటీటీలో ప్రసారాలకు కూడా భారీగా ఆదరణ పెరిగింది.  దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులకు చేరువయ్యాం. అదేవిధంగా పీకేఎల్‌ పది సీజన్లు పూర్తి చేసుకోవడం గొప్ప విజయం. అయినప్పటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, ఇతర విధానాలను చేర్చడం ద్వారా లీగ్‌ను మరింత పెద్దదిగా మార్చాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాం. ఈ పీకేఎల్ పదో సీజన్‌ పోటీలో నాణ్యతతో పాటు ప్రేక్షకులు, వీక్షకులకు సరికొత్త  ప్రమాణాలను నిర్దేశిస్తుందని మేము నమ్మకంగా ఉన్నాం’ అని చెప్పుకొచ్చారు.  
 
ఇక, లీగ్‌ దశలో తమ వంద శాతం ప్రదర్శన చేశామని, ప్లే ఆఫ్స్‌లో కూడా దీన్ని కొనసాగించి ట్రోఫీ నెగ్గుతామని సీజన్ టేబుల్ టాపర్ పుణెరి పల్టాన్  కెప్టెన్‌ అస్లాం ఇనామ్‌దార్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో జట్టు నిలకడైన ఫామ్ గురించి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన అస్లాం ‘మేము చాలా ఆత్మవిశ్వాసంతో ప్లేఆఫ్స్‌లోకి వచ్చాం. లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన తర్వాత ఈ సీజన్‌ను ముగించే ఏకైక మార్గం మా అభిమానులకు పీకేఎల్‌ ట్రోఫీని ఇవ్వడమే అనుకుంటున్నాం. లీగ్ దశలో మేం మా వంద శాతం ప్రదర్శన చేశాం. ప్లే ఆఫ్స్‌లో కూడా దీన్ని కొనసాగించాలని ఆశిస్తున్నాము’ అని చెప్పాడు. 
 
డిఫెండింగ్ చాంపియన్‌ జైపూర్ పింక్ పాంథర్స్ కెప్టెన్ సునీల్ కుమార్ తమ జట్టు టైటిల్‌ను కాపాడుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశాడు. ‘ఎలిమినేటర్స్ నుంచి వచ్చే ఏ జట్టు అయిన  సెమీ ఫైనల్లో మాకు కఠిన సవాల్ విసురుతుంది. కానీ, జైపూర్ పింక్ పాంథర్స్ ఏమాత్రం వెనక్కి తగ్గబోదు. మేం టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి, మూడోసారి ట్రోఫీని అందుకునేందుకు మా వంద శాతం కృషి చేస్తాం’ అని పేర్కొన్నాడు.  
 
ఈ నెల 26న పీకేఎల్ పదో సీజన్ షెడ్యూల్ 
ఎలిమినేటర్1-  దబాంగ్ ఢిల్లీ కేసీ x పట్నా పైరేట్స్ - రాత్రి 8 గం
ఎలిమినేటర్ 2- గుజరాత్ జెయింట్స్ x హర్యానా స్టీలర్స్- రాత్రి 9 గం
వేదిక: హైదరాబాద్
ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉచితంగా ప్రసారం అవుతుంది.