1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 19 జులై 2025 (14:15 IST)

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

Is this a flyover or a drain
జస్ట్ 10 సెంటీమీటర్ల వర్షం పడితే చాలు, హైదరాబాద్ నగరంలోని బస్తీలు జలమయమైపోతున్నాయి. ఇపుడు కొత్తగా ఫ్లైఓవర్లపైనా నడుములు లోతు నీళ్లు నిలబడి వుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇటువంటి రోడ్లను ఎలా నిర్మించారోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్- సమీప జిల్లాలను వరుసగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారత వాతావరణ శాఖ మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ సహా 10 జిల్లాలకు భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేసింది. 
 
దీంతో పాటు హైదరాబాదులో ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేశారు. ముఖ్యంగా వరద ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భారీ వర్షాలు కురిసే సందర్భంలో అనవసరమైన ప్రయాణాలను నివారించాలని, మెట్రో రైలు సేవలను ఎంచుకోవాలని అధికారులు ప్రయాణికులను కోరారు. 
 
నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ- తూర్పు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వంటి మధ్య జిల్లాలు రాబోయే 48 గంటల్లో ఒక మోస్తరు నుండి తీవ్రమైన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధిపతి డాక్టర్ కె. నాగరత్న అన్నారు.
 
హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలో 114.8 మి.మీ, మేడ్చల్-మల్కాజ్‌గిరిలోని బాలానగర్‌లో 114.5 మి.మీ. రాష్ట్రవ్యాప్తంగా, సంగారెడ్డిలోని పుల్కల్ మండలంలో అత్యధికంగా 120 మి.మీ. వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లాలోని ధర్మసాగర్‌లో 108.8 మి.మీ, యాదగిరిగుట్టలో 106.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.