తెలంగాణలో ఏ బెటాలియన్ పోలీసుకి ఇక పెళ్లవదు: బెటాలియన్ పోలీసుల భార్యలు (video)
బెటాలియన్ పోలీసులను బానిసల్లా పనిచేయించుకుంటున్నారనీ, నెలల తరబడి తమ ఇంటికి పంపడం లేదంటూ బెటాలియన్ పోలీసుల భార్యలు ఆందోళన బాట పట్టారు. తమ బాధలు చూసినవారు ఎవ్వరూ భవిష్యత్తులో బెటాలియన్ పోలీసు ఉద్యోగం చేసేవారికి ఎవ్వరికీ పిల్లనివ్వరంటూ చెబుతున్నారు. కనీసం పండుగలకు కూడా వారిని పంపడంలేదనీ, తమ కుటుంబం ఇబ్బందుల్లో వున్నదని చెప్పినా వారిని వదలడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం ఉదయం బెటాలియన్ పోలీసుల భార్యలు కొందరు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. వారిలో ఓ మహిళ మాట్లాడుతూ... మా బాబు తనతో ఆడుకునే కుక్కను గుర్తుపడుతున్నాడు కానీ వాళ్ల నాన్న ఎవరన్నది గుర్తుపట్టట్లేదు. ఎందుకుంటే వీడు పుట్టిన దగ్గర్నుంచి ఆయన వచ్చేది నెలకో రెండు నెలలకోసారో. నాకు ఇప్పుడు రెండో నెల. బాబుకి 18 నెలలు. నాకు స్కానింగ్ తీయించడానికి ఎవరూ లేరు. కనీసం వారంలో ఒక్కరోజైనా మా ఆయన వస్తే ఇది చేద్దామనుకుంటే ప్రభుత్వం వారిని వదలడంలేదు. ఇంతకంటే కూలీ పనులు చేసుకుని బతకడం మేలు'' అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.