సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2023 (09:30 IST)

తెలంగాణ సచివాలయ బాహుబలి ద్వారాలు తెరుచుకున్నాయ్...

ts secretariat doors
గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. అయితే, ఈ కొత్త సచివాలయాన్ని చూడాలంటే సామాన్య ప్రజానీకం బయట రోడ్డు మీద నుంచి చూడటమే గానీ, లోనికి వెళ్లే అవకాశమే లేదు. కానీ, గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే సచివాలయ తలపులు తెరుచుకున్నాయి. వీటినే బాహుబలి ద్వారాలు అని పిలిచేవారు. అంతే... వెల్లువలా జనం తరలివచ్చారు. 
 
కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులు, ఉద్యోగులు ఒక్కసారిగా పోటెత్తారు. కొత్త సీఎంను కలవడానికి ఆతృతపడ్డారు. దీంతో సచివాలయం జనంతో కిటకిటలాడింది. ఎల్బీ స్టేడియంలో రేవంత్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి వచ్చారు. సీఎం అక్కడికి వస్తున్నారని తెలిసి సాధారణ ప్రజలు కూడా తరలివచ్చారు. 
 
వీరితో పాటు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు, సెక్రటరియేట్‌లోని అధికారులు, సిబ్బంది అంతా పెద్ద సంఖ్యలో గుమిగూడారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్‌ సచివాలయానికి చేరుకున్నారు. ప్రధానద్వారం వద్ద ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. రేవంత్‌ రాగానే కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజలు రేవంత్‌రెడ్డి జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన ఆరో అంతస్తులోని తన చాంబర్‌లోకి ప్రవేశించారు.
 
మరోవైపు, సీఎం తన చాంబర్‌లోకి రాగానే ఉద్యోగులు, అధికారుల సంఘాల నేతలు వచ్చి ఆయనను కలిశారు. రాష్ట్ర డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీగా నియమితులైన శివధర్‌ రెడ్డి సీఎంను కలిసి అభినందనలు తెలిపారు. అనేక మంది ఉన్నతాధికారులు కూడా సీఎంని కలిసి అభినందనలు తెలిపారు. 
 
అదేసమయంలో సచివాలయంలోకి వస్తున్న వారిని పోలీసులు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఏదైనా ఐడీ కార్డు చూపిస్తే లోపలికి వెళ్లడానికి అనుమతించారు. సీఎం చాంబర్‌ వద్ద మాత్రం ఇరు వైపులా మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటుచేశారు. వీఐపీలు, ఇతర అధికారులు, అనుమతి ఉన్న పార్టీ నేతలను మాత్రమే సీఎంను కలిసే అవకాశం కల్పించారు.