బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

తెలంగాణ మహిళలకు శుభవార్త : సోనియా పుట్టిన రోజు కానుక.. ఉచిత బస్సు ప్రయాణం

free bus travel
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మంత్రివర్గం కూడా కొలువుదీరింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీల అమలుకు నడుం బిగించారు. అందులో ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. రెండోది రాజీవ్ ఆరోగ్య బీమా పథకం కింద వైద్య ఖర్చులకు చెల్లించే మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 
 
అయితే, రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలైతే తెలంగాణ ఆర్టీసీ ప్రతి యేటా రూ.3 వేల కోట్ల మేర అదనపు భారం పడుతుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ పథకంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడిన తర్వాత.. భారం ఎంత అనేదానిపై స్పష్టత చెబుతున్నారు. ఈ నెల 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 
 
ఈ పథకం ఇప్పటికే కర్ణాటకలో రాష్ట్రవ్యాప్తంగా, తమిళనాడులో నగరాల్లో, అర్బన్‌ ప్రాంతాల్లో ఈ తరహా పథకం ఇప్పటికే అమల్లో ఉంది. కర్ణాటకలో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. తెలంగాణలో అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశమిస్తే.. ఏటా రూ.3 వేల కోట్ల మేర అదనపు భారం పడుతుందని, అదే పల్లెవెలుగు (ఆర్డినరీ), ఎక్స్‌ప్రెస్‌ బస్సులతో సరిపెడితే.. రూ.2,500 కోట్ల భారం ఉంటుందని ఆర్టీసీ అధికారులు వివరిస్తున్నారు. 
 
ఆర్టీసీ ప్రస్తుత ఆక్యుపెన్సీ రేషియోలో మహిళల వాటానే అధికంగా ఉంది. ఆర్టీసీ బస్సులు రోజూ సగటున 40 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తుండగా.. వారిలో మహిళల వాటా 50 నుంచి 55 శాతంగా ఉంది. ఇప్పుడు రోజుకు రూ.15 కోట్ల నుంచి రూ.16 కోట్ల మేర ఆర్టీసీకి చార్జీల రూపంలో ఆదాయం వస్తుండగా.. ఉచిత ప్రయాణ పథకంతో ఆ రెవెన్యూ సగానికి పడిపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
మరోవైపు, ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వస్తే మహిళలు ఆధార్‌ కార్డును చూపిస్తే సరిపోతుందని అధికారులు వివరించారు. వారికి సున్నా చార్జీ టికెట్లు ఇస్తారని.. దీనిపై ఇంకా ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉందని చెబుతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయడం పెద్ద కష్టమైన పని కాదని, ఇప్పటికే ప్రభుత్వం పలు కేటగిరీలకు ఇచ్చే బస్‌పాసుల్లో రూ.వెయ్యి కోట్ల దాకా రాయితీలు ఇస్తున్నట్లు గుర్తుచేశారు. ఇందుకు అదనంగా మరో రూ.2 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చగలిగితే.. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయవచ్చని పేర్కొన్నారు.