రేవంత్ సర్కారుకు మంచి పేరు వస్తుందనే మెట్రోకు కేంద్రం నో : విజయశాంతి
తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్ నగరంలో రెండో దశ మెట్రో పనులకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కేంద్ర తీరును తప్పుబడుతున్నారు. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్న ఉద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ రెండో దశ మెట్రో పనులకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
ఇదే అంశంపై సినీ నటి, ఆ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందన్న రాజకీయ కారణాలతోనే కేంద్రం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలుపకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని ఆమె ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారీ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి మెట్రో రైల్ రెండో దశ విస్తరణ ఆవశ్యకతను వివరిస్తున్నారని తెలిపారు. ఎన్నిసార్లు ప్రతిపాదనలు సమర్పించినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆమె ఆరోపించారు.
ఈ విషయంలో గ్రేటర్ హైరాబాద్ నగర పరిధిలోని బీజేపీ నేతలు తమ బాధ్యతను గుర్తించాలని కోరారు. జీహెచ్ఎంసీలో రెండో అతిపెద్ద పార్టీగా 42 మంది కార్పొరేటర్లు బీజేపీకి ఉన్నారని, వారు మెట్రో విస్తరణకు కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు.
తమను నమ్మి ఓటు వేసిన నగర ప్రజలకు న్యాయ చేయాలంటే బీజేపీ నేతలు కూడా మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ప్రత్యేక బాధ్యత వహించాలని విజయశాంతి ఈ మేరకు డిమాండ్ చేశారు.