శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 మార్చి 2020 (15:53 IST)

హైదరాబాద్‌లో 70 యేళ్ళ వృద్ధుడికి కరోనా.. స్పైస్ జెట్ ఆఫీసర్‌కు కూడా...

హైదరాబాద్ నగరంలో మరో కరోనా కేసు నమోదైంది. అమెరికా నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన 70 యేళ్ళ వృద్ధుడికి ఈ కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, స్పైస్ జెట్ విమానయాన సంస్థకు చెందిన పైలట్‌కు కూడా వైరస్ సోకినట్టు ఆ సంస్థ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని మదీనగూడ మైత్రీనగర్‌కు చెందిన 70 సంవత్సరాల వృద్ధుడికి కరోనా పాజిటీవ్‌ ఉన్నట్లు తేలింది. ఈ నెల 14వ తేదీన ఆయన అమెరికా నుంచి వచ్చారు. 22వ తేదీ నుంచి జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో అతడిని 26వ తేదీన పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. 
 
వృద్ధుడి రక్త నమూనాలు పంపగా ఆదివారం అది పాజిటీవ్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడి కుటుంబ సభ్యులను వైద్య పరీక్షల కోసం తరలించారు. వారి పనిమనిషి కోసం వెతుకుతున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.
 
మరోవైపు, దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన స్పైస్ జెట్‌కు చెందిన పైలట్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయింది. స‌ద‌రు పైలట్‌ ప‌రీక్ష నివేదిక మార్చి 28న మాకు వ‌చ్చింది. ఆ అధికారి కోలుకునేందుకు మెరుగైన చికిత్స‌నందిస్తున్నామ‌ని సంస్థ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. క‌రోనా సోకిన పైలట్‌తో స‌న్నిహితంగా ఉన్న సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్ కోసం ఇళ్ల‌కు పంపాము. రాబోయే 14 రోజులు ఆ సిబ్బంది అంతా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటార‌ని తెలిపారు.