శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 మార్చి 2020 (11:30 IST)

సండే సందడి : మటన్ - చికెన్ దుకాణాలకు పోటెత్తిన ప్రజలు

ప్రపంచాన్ని మహమ్మారి కరోనా వైరస్ కబళించింది. ఈ వైరస్ బారినుంచి ప్రజలను కాపాడుకునేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు ఎన్నో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కానీ, ప్రజలు మాత్రం తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా, ఆదివారం వచ్చిందంటేచాలు మాంసాహార ప్రియులు మటన్, చికెన్ దుకాణాలకు పోటెత్తుతున్నారు. మటన్, చికెన్ షాపుల మందు జనం కిటకిటలాడుతున్నారు. ఈ కారణంగా ప్రభుత్వం లక్ష్యం నీరుగారిపోతోంది. 
 
క‌రోనా వైరస్ విజృంభిస్తుంద‌ని ప్ర‌భుత్వం ఎంత హెచ్చ‌రిక‌లు జారీచేస్తున్నా మాంసం ప్రియులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మ‌ట‌న్‌, చికెన్ షాపుల ద‌గ్గ‌ర మాంసం కోసం ఎగ‌బ‌డుతూ సామాజిక దూరాన్ని మ‌ర్చిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఇదే ప‌రిస్థితి ఆదివారం ఉదయం కనిపించింది. 
 
ప్ర‌భుత్వ‌, పోలీసు యంత్రాంగం సామాజిక దూరం పాటించాల‌ని ఎంత వేడుకుంటున్న జ‌నం మాత్రం బేఖాతర్ చేస్తున్నారు. వీరి నిర్ల‌క్ష్యం ఖ‌రీదు కొన్ని వేల ప్రాణాలు అని ఎంత మొత్తుకుంటున్న వాటిని లెక్క‌చేయ‌కుండా కేవ‌లం ఆదివారం విందు కోసం జ‌నం తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. 
 
అటు ప‌లుచోట్లు కూర‌గాయ‌ల మార్కెట్ల‌లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. సామాజిక దూరం పాటించ‌కుండానే కూర‌గాయాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ జనాలు మారకుంటే ప్రభుత్వాలు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా ఈ వైరస్ బారి నుంచి ప్రజలను రక్షించండం ఆ దేవుడుతరంకూడా కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.