ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య మనదేశంలో అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆదివారం ఉదయానికి ఈ కేసుల సంఖ్య 1029కు చేరింది. వాస్తవానికి ఈ సంఖ్య శనివారం సాయంత్రానికి 870గా ఉండగా, ఈ ఉదయానికి పాజిటివ్‌గా తేలిన వారి సంఖ్య 1,029కి పెరిగింది.
ఇకపోతే, అధికారిక గణాంకాల ప్రకారం, 987 యాక్టివ్ కేసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతుండగా, 85 మంది రికవరీ అయ్యారు. 24 మంది మరణించారు. ఇక మహారాష్ట్రలో అత్యధికంగా 186 కేసులు నమోదు కాగా, ఆరుగురు మరణించారు. ఆపై రెండో స్థానంలో నిలిచిన కేరళలో 182 మందికి వ్యాధి సోకగా, ఒకరు మరణించారు.
కర్ణాటకలో 81, తెలంగాణలో 67, ఉత్తర ప్రదేశ్‌లో 65, గుజరాత్‌లో 55, రాజస్థాన్‌లో 54, ఢిల్లీలో 49, తమిళనాడులో 42, మధ్యప్రదేశ్ లో 39, పంజాబ్ లో 38, హర్యానాలో 35, జమ్మూకాశ్మీరులో 33 కేసులు నమోదయ్యాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19, పశ్చిమ బెంగాల్‌లో 18, లడ్డాక్‌లో 13, బీహార్‌లో 11, అండమాన్ దీవుల్లో 9, చండీగఢ్‌లో 8, చత్తీస్‌గఢ్‌లో 7, ఉత్తరాఖండ్‌లో 6, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాల్లో 3, మణిపూర్, మిజోరం, పుదుచ్చేరిల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
ఇకపోతే, ఈ వైరస్ బారినపడి చికిత్స పొందుతూ కోలుకున్న వారిసంఖ్య కూడా పెరుగుతోంది. ఈ విషయంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానాలు ముందున్నాయి. మహారాష్ట్రలో 25 మంది వ్యాధిగ్రస్తులు కోలుకోగా, యూపీ, హర్యానాల్లో 11 మంది చొప్పున వ్యాధి నుంచి బయటపడ్డారు.
మరోవైపు, చైనాలోని వుహాన్ కేంద్రంగా పురుడు పోసుకున్న ఈ కరోనా వైరస్ ఇపుడు ఏకంగా 199 దేశాలకు వ్యాపించింది. దీంతో ఈ వైరస్ దెబ్బకు ఆయా దేశాలు హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఓ మహమ్మారి రూపం దాల్చిన ఈ వైరస్ చైనా, అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఇరాన్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో భారీగా ప్రాణాలను బలిగొన్నది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 27,648కి చేరింది. 1,24,326 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కరోనా కేసుల్లో అమెరికా ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. అగ్రరాజ్యంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. అమెరికా తర్వాత 86,498 కేసులతో ఇటలీ రెండో స్థానంలో ఉంది. కరోనాకు జన్మస్థానంగా భావిస్తున్న చైనా 81,340 కేసులతో మూడోస్థానంలో ఉంది. స్పెయిన్‌లో 64,059, జర్మనీలో 49,344, ఇరాన్ లో 32,332, బ్రిటన్‌లో 14,543, స్విట్జర్లాండ్‌లో 12,311, దక్షిణ కొరియాలో 9,332, నెదర్లాండ్స్ లో 8,603 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.