మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (16:33 IST)

వృద్ధురాలిని కొరికి చంపిన కరోనా వైరస్ రోగి.. ఎక్కడ?

తమిళనాడు రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. దీంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లాలో ఓ దారుణం జరిగింది. హోం క్వారంటైన్‌లో ఉన్న ఓ కరోనా రోగి.. పిచ్చిపట్టినట్టు ప్రవర్తించాడు. ఆ తర్వాత ఇంటి బయటకు పరుగులు తీసి.. 90 యేళ్ళ వృద్ధురాలిపై దాడి చేసి కొరికి చంపేశాడు. ఈ ఘటన తాజాగా వెలుగుచూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తేని జిల్లాకు చెందిన 34 యేళ్ళ వ్యక్తి ఇటీవల శ్రీలంక నుంచి స్వదేశానికి వచ్చాడు. ఆయనకు విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరీక్షలు చేయగా, కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆయన్ను హోం క్వారంటైన్‌లో ఉంచారు. అయితే, శుక్రవారం రాత్రి ఉన్నట్టుండి ఈ వ్యక్తి పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఇంట్లో నుంచి నగ్నంగా బయటకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. 
 
ఆ సయమంలో ఆరు బ‌య‌ట ఓ ఇంటి ముందు నిద్రిస్తున్న నాచ్చియమ్మాల్ అనే 90 యేళ్ళ వృద్ధురాలిపై దాడి చేసి, ఆ తర్వాత రక్తం వచ్చేలా గొంతుకొరికేశాడు. అయితే, ఆ రోగి నుంచి తప్పించుకునేందుకు ఆ వృద్ధురాలు బిగ్గరగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 
 
ఆ రోగి దాడిలో గాయపడిన వృద్ధురాలిని పోలీసులు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆ వృద్ధురాలు కన్నుమూసింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.