శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2023 (09:27 IST)

గ్రూప్-2 పరీక్షలు వాయిదా.. యువతి ఆత్మహత్య.. హాస్టల్‌లో ఉరేసుకుని?

suicide
హైదరాబాదులో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన మర్రి ప్రవళిక (23) అశోక్‌నగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధమవుతోంది. నవంబరు 2,3 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలకు వాయిదా వేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది. దీంతో కోచింగ్ తీసుకుంటున్న ప్రవళిక మనస్తాపానికి గురైంది. శుక్రవారం సాయంత్రం హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన గ్రూప్-2 అభ్యర్థులు ప్రభుత్వ నిర్వాకంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  
 
ఆత్మహత్యకు ముందు ప్రవళిక తల్లిదండ్రులకు రాసినట్టుగా ఉన్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనను క్షమించాలని, తానో నష్టజాతకురాలినని ఆ లేఖలో ప్రవళిక ఆవేదన వ్యక్తం చేసింది. 
 
ప్రవళిక ఆత్మహత్యతో అశోక్‌నగర్‌లో అర్ధరాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి అర్ధరాత్రి తర్వాత అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. 
 
దీంతో అభ్యర్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. చివరికి అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో ప్రవళిక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అభ్యర్థులతో కలిసి ఆందోళనకు దిగిన సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.