మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (22:32 IST)

ప్రతీ నార్మల్ డెలివరీకి రూ.3వేలు ఇంక్రిమెంట్ : హరీష్ రావు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రుల్లో సహజ ప్రసవాలు చేసిన వైద్య బృందానికి రూ.3వేల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో గర్భిణులకు సిజేరియన్లు తగ్గించి సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు చర్యలు మరింతగా పెంచింది.
 
సాధారణ ప్రసవాల సంఖ్యను మరింత పెంచేందుకు ఈ విధానం దోహద పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నార్మల్ డెలివరీ వల్ల తల్లికి, శిశువుకు మేలు చేస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో 45శాతం సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. ప్రతీ నార్మల్ డెలివరీకి రూ. 3వేలు ఇంక్రిమెంట్ ఇస్తున్నామని, వైద్యులు, నర్సులు, ఆశాలు, ఏఎన్ఎంలకు ఈ ప్రోత్సాహకంను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
 
రాష్ట్రంలో 55శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రైవేట్లో 80శాతం సిజేరియన్, 20శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని మంత్రి అన్నారు. హెల్త్ సర్వీసెస్ లో దేశంలో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉందని, కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణ ఉందని, ఇది కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారమేనని హరీష్ రావు అన్నారు.