బాధితుల శరీరాన్ని తాకినా మంకీపాక్స్ సోకుతుంది...
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. తొలి మంకీపాక్స్ మృతి కేసు నమోదైంది. విదేశాల నుంచి కేరళ రాష్ట్రానికి వచ్చిన ఓ యువకుడు ఈ వైరస్ నుంచి కోలుకోలేక మృతి చెందాడు. ఇది మన దేశంలో నమోదైన తొలి మృతి కేసు. అయితే, ఈ మంకీపాక్స్ వైరస్... బాధితుల శరీరాన్ని తాకడం, పట్టుకోవడం ద్వారా సన్నిహితంగా మెలగడం వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్వలింగ సంపర్కులే దీని వ్యాప్తికి కారకులుగా పేర్కొనడం.. ఎయిడ్స్ విషయంలో చేసిన పొరపాటును పునరావృతం చేయడమే అవుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం స్వలింగ సంపర్కుల్లోనే కాకుండా ఎవరికైనా మంకీపాక్స్ వ్యాప్తిచెందే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
బాధితుల శరీరాన్ని లేదా వారి దుస్తులను తాకడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని ఎయిమ్స్ (ఢిల్లీ) డెర్మటాలజీ, వెనెరియాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సోమేశ్ గుప్తా తెలిపారు. ఈ మేరకు బాధితులతో కలిసిమెలిసి ఉండే కుటుంబ సభ్యులు, స్నేహితులు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.