గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (17:15 IST)

తెలంగాణాలో వాహనం ఢీకొని చిరుత మృతి

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో చిరుతపులి మృతి చెందింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో అటవీ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన జిల్లాలోని దేవరకద్ర మండలంలో చోటుచేసుకుంది. 
 
దేవరకద్రలోని 167వ జాతీయ రహదారికి ఇరువైపులా మన్యంకొండ, గద్దెగూడెం అటవీ ప్రాంతాలు ఉన్నాయి. 
 
ఈ అటవీ క్షేత్రంలో కొన్నేళ్లుగా చిరుత సంచరిస్తున్నట్లుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. మంగళవారం రాత్రి సమయంలో రోడ్డుకు ఇరువైపులా గొర్రెల మందలు నిలపడంతో వేటకు వచ్చిన చిరుత పులి... రోడ్డు దాటే క్రమంలో మన్నెంకొండ - చౌదర్పల్లి గుట్టల మధ్య బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. 
 
స్థానిక పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతిచెందిన చిరుతను పరిశీలించారు. రెండేళ్ల వయసు ఉన్న ఆడ చిరుత పులి వేటకు వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు మహబూబ్ నగర్ అటవీశాఖ రేంజ్ అధికారి చంద్రయ్య తెలిపారు. 
 
ఈ ఘటనా స్థలంలో విచారణ చేపట్టిన అధికారులు పశువైద్యుడితో పోస్టుమార్టం చేయించి చిరుత మృతికి గల పూర్తి కారణాలపై ఆరా తీస్తున్నారు. స్థానికంగా ఉన్న గుట్టల్లో చిరుతల గుంపు ఉన్నట్లు తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు. మన్యంకొండ క్షేత్ర పరిధిలో ఈ ప్రమాదం జరగడంతో చిరుతల సంచారంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు.