బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (20:00 IST)

దేశానికే తెలంగాణ ఆదర్శం : గవర్నర్ తమిళిసై

తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. సరికొత్త సంక్షేమ  పథకాలతో తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకెళుతుందని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించు కుని ఆమె ట్విట్టర్ వేదికగా ఆమె మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ఆమె వెల్లడించారు.

శాంతియుత పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఘనత తెలంగాణ ప్రజలకే దక్కిందని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉండడంతో ప్రజలు సంతోషంతో ఉన్నారని ఆమె కొనియాడారు.

కరోనా కాలంలో ప్రజలు ధైర్యంగా ముందుకు సాగడం అభినందనీయమని ఆమె వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం చెప్పిన నిబంధనలు పాటించాలని చెప్పారు. సామాజిక దూరం పాటించడం, మాస్క్ లు ధరించడంతో పాటు వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతతో కరోనాను అరికట్టవచ్చని ఆమె ప్రజలకు సూచించారు.

రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండడంతో త్వరలోనే బంగారు తెలంగాణ ఏర్పడడం ఖాయమని ఆమె పేర్కొన్నారు. గవర్నర్ తమిళిసై మంగళవారం తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.

ఈ క్రమంలో సిఎం కెసిఆర్ రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి జన్మదినశుభాకాంక్షలు తెలిపారు. పరిపూర్ణ ఆరోగ్యంతో ముందుకు సాగాలని కెసిఆర్ ఆకాంక్షించారు.