మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 24 మే 2020 (22:15 IST)

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయికే రంజాన్: ఏపి గవర్నర్

పవిత్ర రంజాన్ మాసం ఈద్ ఉల్ ఫితర్ గా ముగిసిన శుభవేళ ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు.

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికగా విశ్వ వ్యాప్తంగా రంజాన్ మాసం పవిత్రతను ఆపాదించుకుందన్న గవర్నర్ పవిత్ర ఖురాన్ బోధనలు యుగయుగాలుగా మానవాళిని ప్రభావితం చేస్తున్నాయన్నారు.

రంజాన్ మాస పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది ప్రేమమూర్తిగా మార్పు చెందుతారని, ఈ మాసంలో ఆధ్యాత్మిక ఆరాధనతో అనుబంధం మరింత బలపడుతుందని బిశ్వభూషణ్ పేర్కొన్నారు. 

క్రమశిక్షణను అనుసరిస్తూ శాంతి, సౌభ్రాతృత్వాన్ని లోకానికి చాటడంలో ఈ మాసం ప్రత్యేకతగా నిలిచిందని, కఠోర ఉపవాస వ్రతం సహనాన్ని పెంచుతుందని గౌరవ హరిచందన్ వివరించారు.

సర్వ మానవాళి సమానత్వాన్ని చాటుతూ,  దాతృత్వాన్ని అలవరచే రంజాన్ పండుగ వేళ ఇస్లాంను గౌరవించే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెల్లి విరియాలని గవర్నర్ తెలిపారు.  ఈ మేరకు రాజ్‌భవన్ ఒక ప్రకటన వెలువరించింది.
 
జగన్‌ శుభాకాంక్షలు
ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భాకాంక్షలు(ఈద్‌ ముబారక్‌) తెలిపారు. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ శుభసంతోషాలు కలగాలని  జగన్‌ ఆకాంక్షించారు.

దైవత్వాన్ని నింపుకునేందుకు అల్లాహ్‌కు ఇష్టమైన జీవన విధానాన్ని ముస్లింలు ఈ విపత్కర కరోనా సమయంలోనూ జాగ్రత్తలు పాటిస్తూ.. నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించారని తెలిపారు. నెలరోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్యమాసానికి రంజాన్‌ ఒక ముగింపు వేడుక కాగా, ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని ఆయన తెలిపారు.

మహనీయుడైన మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించింది కూడా రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని పేర్కొన్నారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడాలన్న ఆశయం రంజాన్‌ పండుగలో అంతర్లీనంగా ఉన్న సందేశం అని అన్నారు. 

రంజాన్‌ అంటే ఉపవాస దీక్షలు మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ అని తెలిపారు.