రంజాన్ ప్రార్థనలను ఇళ్లలోనే నిర్వహించుకోవాలి: ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్నందున ఈ రంజాన్ మాసంలో ముస్లింలందరూ ఇళ్లల్లోనే రంజాన్ ప్రార్థనలు నిర్వహించుకోవాలని ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా విజ్ఞప్తి చేశారు.
ఇది మనసుకు కష్టమైన మాట అయినా సరే.. చెప్పక తప్పని పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరోనా విఫత్కర పరిస్థితులు ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే అని, కరోనా వైరస్‌ను అధిగమించేందుకు గత కొన్ని రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయన్నారు.
కోవిడ్-19 నివరణపై చర్యల్లో భాగంగా.. ప్రధానంగా ప్రతిఒక్కరూ భౌతిక దూరంతో పాటు.. స్వీయ గృహ నిర్బంధం పాటించాలనే ఉద్దేశ్యంతో.. ప్రభుత్వం మార్చి నెల మూడో వారం నుండి లాక్ డౌన్ చేపట్టడం జరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో పవిత్రమైన పండుగ పర్వదినాల్లో సైతం.. దేవాలయాలు, చర్చీల్లో, మజీదుల్లో పూజలు, ప్రార్థనలు సామూహికంగా చేసుకోలేని పరిస్థితులు ఎదురయ్యాయన్నారు.
ఇటీవలే... ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలను కూడా ఇళ్లల్లోనే చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం రంజాన్ మాసం ఆరంభం కానున్న నేపథ్యంలో.. ముస్లిం సోదరులు కూడా.. ఇళ్లలోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
పర్వదినాల నిర్వహణకు కూడా ఇలాంటి ఆంక్షలతో కూడిన విధివిధానాలు పాటించడం.. మన మనసుకు కొంత కష్టమయినా సరే.. ప్రజా శ్రేయస్సు కోసం పాటించడం తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇందుకోసం ముస్లిం మత పెద్దలు ప్రజారోగ్యం కోసం పాటుపడుతున్న ప్రభుత్వ విధానాలకు సహకరించి.. ఈ రంజాన్ మాసంలో ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకునేలా ముస్లిం సోదరులందరికీ అవగాహన కల్పించాలని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే వీడియో కాన్ఫెరెన్సు ద్వారా.. అన్ని జిల్లాల నుండి... ముస్లిం మత పెద్దలను కోరడం జరిగిందన్నారు.
ఈ సందర్బంగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి వారి సూచనల మేరకు యావత్ మసీదు కమిటీ సభ్యులు, మూతవల్లీ, ఇమాములు, మౌజన్ లు ఆచరించాల్సిన అంశాలను ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలియజేస్తూ.. వాటిని అమలయ్యేలా చూడాలని కోరారు.