బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2019 (05:34 IST)

వీర‌వనిత‌లే ఆద‌ర్శం... ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా

ఇస్లాం ధర్మంలో విద్యకు అత్యంత విలువైన స్థానం ఉందని, సృష్టిని, సృష్టికర్తని తెలుసుకోవాలంటే మహిళలకు విద్య తప్పనిసరని, విద్యను ఆర్జించడం ప్రతి ముస్లిం యొక్క విధి అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు.

బాలికల విద్య, బాల్యవివాహాలు, బాలల అక్రమ రవాణాపై గురువారం విజ‌య‌వాడ‌లోని ఓ ప్రైవేటు సమావేశ మందిరంలో మహితా, ప్లాన్ ఇండియా, మైనార్టీ సంక్షేమ శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఉపముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రి ఎస్.బీ.అంజాద్ బాషా పాల్గొని మాట్లాడారు.

ప్రతి మహిళ మన వీరవనితలను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధిలో ముందుకు వెళ్లాలన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకం ద్వారా నిరక్షరాస్యత నిర్మూలనకు, రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రోత్సహించి వంద శాతం అక్షరాస్యతకు కృషి చేస్తున్నారన్నారు. అంతేకాకుండా మహిళలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లేందుకు మహిళా సాధికారిత కోసం 50 శాతం రిజర్వేషన్స్ తీసుకొచ్చి ఇచ్చిన హామీలను అమలుచేస్తున్నారన్నారు.

చిన్నతనంలోనే జరిగే బాల్య వివాహాలు సమాజంలో ఉన్న అతి పెద్ద సమస్య అని దీనికి తోడు బాలికల అవిద్య, బాలికల అక్రమ రవాణా కూడా ఉందన్నారు. ఇస్లాం ధర్మంలో విద్యకు అతి ప్రాముఖ్యం ఇవ్వడం జరిగిందని సృష్టిని, సృష్టి కర్తను తెలుసుకోవాలంటే మహిళలు విద్యను అభ్యసించాలన్నారు. బాలికలకు మొదటి పాఠశాల అమ్మవడి అని అన్నారు.

ఆడా, మగ తేడాలేకుండా విద్యను అభ్యసించాలన్నారు. పాఠశాల విద్య పూర్తి అయిన తర్వాత మంచి వ్యక్తితో పెళ్ళి చేస్తే, అనాధ బాలికలను ఆదరించి చదివిస్తే వారు నాతో పాటు స్వర్గంలో ఉంటారని ప్రవక్త చెప్పారన్నారు. ఇలా బాలికలను ఆదరించాల్సిన అవసరం ముస్లిం పెద్దలపై ఉందన్నారు.

పెళ్లి అనేది ఇరు కుటుంబాల మధ్య జరిగే విషయమని, బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ఖాజీల పై ఉందన్నారు. చిన్న వయస్సులో పెళ్లి చేస్తే వచ్చే దుష్ఫలితాల గురించి సమాజంలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.

ముస్లిం సమాజంలో రుగ్మతలను తొలగించాలంటే సంపూర్ణ అక్షరాస్యత అత్యంత అవసరమన్నారు. సంపూర్ణ అక్షరాస్యతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల మహిళలు బాలికల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముస్లిం మత పెద్దలు సమాజాన్ని తీర్చిదిద్దే వ్యక్తులు వీరు ఇలాంటి సందేశాన్ని సమాజానికి అందించాలన్నారు.

విద్యారంగంలో ముస్లిం మహిళలు ప్రపంచ స్థాయిలో ముందంజలో ఉన్నారన్నారు. ప్రపంచంలో మొదటిగా ముస్లిం వర్శిటీని ఫాతిమా బీవి మొరాకో దేశంలో 1160 సంవత్సరాల క్రితం స్థాపించారని ఆ యూనివర్శిటీ ఇప్పటికీ కొనసాగుతుందన్నారు.

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఝాన్నీ లక్ష్మీభాయ్, హజ్రత్ మహల్, అరుణా అసఫ్ అలీల పాత్ర ఉందన్నారు. సాహిత్యం , కళల్లో ముస్లింలు ఎంతో ముందు ఉన్నారన్నారు. సుప్రీం కోర్టు మొదటి ముస్లిం మహిళా న్యాయమూర్తిగా ఫాతిమా బీవి ముస్లిం మహిళలకు ఆదర్శమన్నారు. ఇస్లాం ధర్మంలో పెళ్లి ఇరువర్గాల మధ్య జరుగుతుందన్నారు. యుక్త వయస్సు రాకుండా పెళ్లి చేయడం ఇస్లాం కు వ్యతిరేకమని అమ్మాయి సమ్మతి కూడా పెళ్లికి ఉండాలన్నారు.

బాల్య వివాహాలవల్ల ఆరోగ్యం పాడటవటంతో పాటు ఎన్నో ఇబ్బందులు వస్తాయని అన్నారు. వరకట్నం, అవిద్య, నిరక్షరాస్యత, లాంటి రుగ్మతలను అధిగమించాల్సిన అవసరం అందరిపై ఉందని ముఖ్యంగా ఖాజీల పాత్ర ప్రముఖంగా ఉందన్నారు.
 
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ 18 సంవత్సరాల కంటే ముందు ఆడపిల్లలకు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాల్య వివాహాలపై దేశ, విదేశాలలో కూడా చర్చ జరుగుతుందన్నారు. ముస్లిం పర్సనల్ లా కాపాడుటంతో పాటు బయటనుంచి వచ్చే ఛాలెంజెస్ పై ఆలోచించాలన్నారు.

వాస్తవాలకంటే అపోహలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందన్నారు. బాల్య వివాహాలు అన్ని కులాల్లో, మతాల్లో ఉన్నాయని వీటిని రూపుమాపటానికి సమాజంలో అందరూ ధృష్టి పెట్టాలన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అమ్మవడి, ఫీజు రీఇంబర్స్మెంట్ లతో విద్యను ప్రోత్సహించి ప్రోత్సాహాలను అందిస్తుందన్నారు. మహిళల సామాజిక, ఆర్థిక విషయాలను మార్చడానికి కలసివచ్చే అందరికీ మహిళా కమిషన్ అందుబాటులో ఉంటుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణా కమీషన్ చైర్ పర్సన్ జి. హైమావతి మాట్లాడుతూ బాల్యవివాహాలు సమాజాన్ని పీడిస్తున్న ఒక దురాచారంగా ఉందని దీనిపై ఒక యాక్షన్ ప్లాన్ పై ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 1865 ఉర్దూ మీడియం స్కూల్స్ లో 80,480 మంది విద్యను అభ్యశిస్తున్నారన్నారు.

కార్యక్రమంలో మహితా ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్ శేఖర్ రెడ్డి, మహితా కోఆర్డినేటర్ బోడే ప్రసాద్, ప్లాన్ ఇండియా సీనియర్ ప్రాగ్రామ్ కోఆర్డినేటర్ మిస్ అనితాకుమార్, ఖాజీలు, ముస్లిం పెద్దలు తదితరలు పాల్గొన్నారు.