శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:44 IST)

ప్రతి గిరిజన కుటుంబానికీ ప్రభుత్వ సాయం : ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్, రూ.1000 ఆర్థిక సహాయాలతో పాటుగా అంగన్ వాడీ కేంద్రాల నుంచి ఇళ్లకు చేర్చాల్సిన పోషకాహారం ను కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రతి గిరిజన కుటుంబానికీ చేర్చేలా చర్యలను తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఐటీడీఏ పిఓలను కోరారు.

కరోనా వైరస్ గిరిజన ప్రాంతాలకు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఎప్పటి కప్పుడు సమీక్షలు నిర్వహించడం ద్వారా గిరిజన ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని ఆదేశించారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఐటీడీఏల పరిధిలో రేషన్, ఆర్థిక సహాయాల పంపిణీలతో పాటుగా కరోనా క్వారంటైన్, సోషియల్ డిస్టెన్స్ అమలుపై సోమవారం ఐటీడీఏ పిఓలతో టెలీకాన్ఫరెన్స్ లో డిప్యుటీ సిఎం సమీక్షించారు.

ఈ సందర్భంగానే పార్వతీపురం. సీతంపేట, పాడేరు, కేఆర్ పురం, చింతూరు, శ్రీశైలం, నెల్లూరు ఐటీడీఏల పిఓలతో పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, గిరిశిఖర గ్రామాలు, రహదారులు లేని గిరిజన గ్రామాలకు రేషన్ ఇంకా అందలేదనే ఫిర్యాదులు ఉన్నాయని, అలాంటి ప్రాంతాలకు కూడా రేషన్ ను చేర్చాలని ఆదేశించారు.

అవసరమైన చోట జీసీసీకి చెందిన వాహనాలను కూడా రేషన్ సరఫరాకు  వినియోగించుకోవాలని, నేరుగా గిరిజనుల ఇళ్ల వద్దకే రేషన్ ను చేర్చాలని, 100శాతం రేషన్ పంపిణీ జరగాలని స్పష్టం చేసారు. ఈ అంశంపై పిఓలు తమ ప్రాంతాల్లో రేషన్ పంపిణీకి సంబంధించిన విషయాలను ఉప ముఖ్యమంత్రికి వివరించారు.

పోలవరం ముంపు ప్రాంతమైన చింతూరు ఐటీడీఏ పరిధిలో కొన్ని గిరిశిఖర గ్రామాలతో పాటుగా బోటులో మాత్రమే వెళ్లగలిగే గ్రామాలు కూడా ఉన్నాయని, అలాంటి గ్రామాలకు ఐటీడీఏ ద్వారా బోటులో రేషన్ సరఫరా చేసామని, గిరిశిఖర గ్రామాలకు వాలంటీర్లతో పాటుగా స్వచ్ఛంధ సంస్థలతో కలిపి గిరిజనుల ఇళ్ల వద్దకే రేషన్ చేర్చామని చింతూరు ఐటీడీఏ పిఓ తెలిపారు.

పాడేరు ఐటీడీఏ పరిధిలో ప్రతి రేషన్ షాపుకు ఒక సచివాలయ ఉద్యోగిని ఇంచార్జ్ గా నియమించామని, మండలానికి ఒక స్పెషలాఫీసర్ ను పెట్టి రేషన్ పంపిణీ పటిష్టంగా చేసామని పాడేరు ఐటీడీఏ పిఓ వివరించారు. రేషన్ కార్డులు లేని గిరిజన కుటుంబాలకు కూడా బియ్యాన్ని అందించామని ఈ సందర్భంగా పలువురు పిఓలు చెప్పారు.

నెల్లూరు యానాది ఐటీడీఏ పరిధిలో సంచారజాతికి చెందిన 900 గిరిజన కుటుంబాలకు రేషన్ కార్డులు లేకపోయినా పౌరసరఫరాల శాఖ ద్వారా ఉచిత రేషన్ ను పంపిణీ చేసామని నెల్లూరు పిఓ వెల్లడించారు. శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో కొన్ని మారుమూల గిరిజన గ్రామాలకు రేషన్ తో పాటుగా కూరగాయలను, పచ్చళ్లను  కూడా పంపిణీ చేసామని శ్రీశైలం పిఓ తెలిపారు.

అలాగే తమ ప్రాంతాల్లో రూ.1000 ఆర్థిక సహాయం పంపిణీ ఇప్పటికే సగటుప80 శాతానికి పైగా పూర్తయిందని మిగిలిన 20 శాతం పంపిణీని  మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని పిఓలు చెప్పారు. దీంతో పాటుగా పింఛన్ల పంపిణీ 90 శాతానికి పైగా పూర్తయిందని స్థానికంగా అందుబాటులో లేని లబ్దిదారులు మినహా మిగిలిన వారందరికీ పెన్షన్ పంపిణీ పూర్తి చేసామని కూడా పిఓలు వివరించారు.

సీతంపేట ఐటీడీఏ పరిధిలో పింఛన్ల పంపిణీ 100శాతం పూర్తయిందని పిఓ తెలిపారు.ఈ విషయాలపై పుష్ప శ్రీవాణి స్పందిస్తూ, ఇప్పటి వరకూ రేషన్, పింఛన్, రూ.వెయ్య ఆర్థిక సాయం పంపిణీ ఎంత శాతం జరిగిందనే విషయాన్ని సమీక్షించడంతో పాటుగా 100 శాతం పంపిణీ అయ్యేలా చర్యలు చేపట్టాలని పిఓలను ఆదేశించారు.

అదే విధంగా లాక్ డౌన్ నేపథ్యంలో అంగన్ వాడి కేంద్రాల్లో బాలింతలు, గర్భిణీలు, పిల్లలకు ఇస్తున్న పోషకాహారానికి సంబంధించిన రేషన్ ను నేరుగాలబ్దిదారుల ఇళ్లకే చేర్చాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఈ రేషన్ ఏ మేరకు గిరిజనులకు చేరిందనే విషయాన్ని పరిశీలించాలని కోరారు.

దీనిపై పిఓలు మాట్లాడుతూ, కొన్ని ప్రాంతాల్లో తొలి విడతలో అంగన్ వాడీల నుంచి రేషన్ పంపిణీ జరిగిందని, ఇప్పటి వరకూ అంగన్ వాడి రేషన్ చేరని కుటుంబాలకు మలి విడతలో ఖచ్చితంగా చేరేలా చూస్తామని చెప్పారు. అంగన్ వాడీలకు చెందిన సూపర్ వైజర్లు, ఇతర సిబ్బందితో ఈ విషయంగా సమావేశాలను నిర్వహించి రేషన్ ఏ మేరకు చేరిందనే విషయాన్ని సమీక్షించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.

అందర్నీ పిలిచి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం సాధ్యంకానప్పుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సూచించారు. గ్రామ సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులను కూడా ఈపనికి  వినియోగించుకోవాలని కోరారు. వాలంటీర్ల ద్వారా జరుగుతున్న హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రసవ సమయం దగ్గరపడిన గిరిజన మహిళల వివరాలన్నింటినీ అందుబాటులో ఉంచుకోవాలని, వారి ప్రసవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా పుష్ప శ్రీవాణి ఆదేశించారు. వివిధ ఐటీడీఏలలో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయా, లేదా అనే విషయాలను పిఓలను అడిగి తెలుసుకున్నారు.

కాగా గిరిజనుల్లో ఏ ఒక్కరికి కరోనా సోకినా మొత్తం గ్రామం అంతటికీ సోకే ప్రమాదం ఉంటుందని ఈ నేపథ్యంలోనే ఇంటింటికీ సర్వే చేసి, అనుమానితుల శాంపిల్స్ ను పరీక్షలకు పంపాలని కోరారు. అలాగే  గిరిజన గ్రామాల్లో ప్రతి గిరిజనుడికి కూడా మాస్కులను అందించాలని కోరారు. వెలుగు సంఘాల ద్వారా తాము తక్కువ ధరకే మాస్కులు చేయించి గిరిజనులకు అందిస్తున్నట్లు ఈ సందర్భంగానే సీతంపేట టీటీడీఏ పిఓ తెలిపారు.

కాగా లాక్  డౌన్ సమయంలో గిరిజనులకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ లభించేలా చూడాలని, అదే సమయంలో వాటి ధరలను కూడా నియంత్రించాలని  డిప్యుటీ సిఎం కోరారు. ప్రస్తుతం రవాణా ఖర్చులు అధికంగా ఉన్న సమయంలో అటు వ్యాపారులు కూడా నష్టపోకుండా ఇటు ప్రజలు కూడా మోసపోకుండా ధరలు నిర్ణయించి విక్రయించడానికి చర్యలను తీసుకోవాలని పిఓలకు ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసారు.

లాక్ డౌన్ సందర్భంగా క్వారంటైన్ కు సంబంధించిన అంశాలను పుష్ప శ్రీవాణి అడిగి తెలుసుకున్నారు. చింతూరు ఐటీడీఏ కు ఆంధ్రప్రదేశ్ తో పాటుగా తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు కూడా సరిహద్దులుగా ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టులో పనులు చేయడానికి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చారని చింతూరు పిఓ తెలిపారు.

వలస కూలీలకు క్వారంటైన్ కేంద్రంలో పెట్టి అన్ని సదుపాయాలు కల్పించామని, అన్ని పరీక్షలను నిర్వహించి, క్వారంటైన్ గడువు ముగిసాక వారి స్వగ్రామాలకు పంపామని వివరించారు. కేఆర్ పురం పిఓ మాట్లాడుతూ, తెలంగా సరిహద్దుల నుంచి కూడా తమ ఐటీడీఏ పరిధిలోకి ఎవరైనా వచ్చే అవకాశం ఉందని ముందస్తుగా క్వారంటైన్ కు ఏర్పాట్లు చేసామన్నారు.

ఢిల్లీ నిజాముద్దీన్ సమావేశం నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి హోం క్వారంటైన్ లో పెట్టామని తెలిపారు.  ఈ సమావేశంలో ఐటీడీఏ పిఓలు సి.ఎం. శ్రీకాంత్ వర్మ(సీతంపేట), డికె బాలాజీ (పాడేరు), ఎ.వెంకటరమణ (చింతూరు), సూర్యనారాయణ (కేఆర్ పురం), రవీంద్ర నాథ్ రెడ్డి (శ్రీశైలం), మణికుమార్ (నెల్లూరు) తదితరులు పాల్గొన్నారు.