శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 24 మే 2020 (22:05 IST)

విజయవాడలో ఫైన్‌ లేకుండా వాహనాలు విడుదల

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌లో‌ నిబంధనలు ఉల్లఘించి పట్టుబడిన వాహనాలకు విముక్తి లభించింది. లాక్డౌన్‌లో సీజ్ చేసిన వాహనాలను వదిలేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలు శరవేగంగా అమలవుతున్నాయి.

అపరాధ రుసుము లేకుండానే పోలీసులు వాహనాల యజమానులకు ఇచ్చేస్తున్నారు. ఇటువంటి తప్పు మళ్లీ చేయకుండా వాహనదారుల నుంచి బాండ్‌ రూపంలో పూచికత్తు తీసుకుంటు​న్నారు. అదే విధంగా మోటార్‌ వెహికిల్‌ యాక్టు కింద సీజ్‌ చేసిన వాహనాలకు నామమాత్రపు 
 
ఫైన్‌ వసూల్‌ చేస్తున్నారు. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో ఆదివారం పలు వాహనాలను పోలీసులు విడుదల చేశారు. పోలీసు స్టేషన్‌ వద్ద భౌతిక దూరం పాటిస్తూ యజమానులు తమ వాహనాలను తీసుకుంటున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఫైన్ లేకుండా వాహనాలను తిరిగి ఇవ్వటం ఆనందంగా ఉందంటూ వాహనాల యజమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. కంటైన్‌మెంట్‌ జోన్లలో నిబంధనలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు.

సిటీలో కంటైన్‌మెంట్‌ జోన్లలో తప్ప మిగిలిన చోట్ల దుకాణాలు తెరుచుకోవచ్చుని ఆయన చెప్పారు. కంటైన్‌మెంట్‌ జోన్లు కాని చోట కొత్తగా కరోనా కేసులు వస్తే ఆంక్షలు విధిస్తామని ఆయన పేర్కొన్నారు. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కర్ఫ్యూ ​కొనసాగుతుందని సీపీ తెలిపారు.

రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు తమ ఇంటి వద్దనే పండగ జరుపుకోవాలని ఆయన  విజ్ఞప్తి చేశారు. కరొనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు సహకరించాలని సీపీ ద్వారకా తిరుమలరావు కోరారు.