బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2017 (09:03 IST)

ఆర్నెల్ల క్రితమే పునాది వేసుకున్న రేవంత్ రెడ్డి : ఎల్ రమణ

టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు... శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డిపై టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆర్నెల్ల క్రితం నుంచే రేవంత్ రెడ్

టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు... శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డిపై టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆర్నెల్ల క్రితం నుంచే రేవంత్ రెడ్డి గట్టి పునాది వేసుకున్నాడనీ ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పార్టీ మారాలని ఆరు నెలల ముందు నుంచే రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందించుకున్నారని, అప్పటి నుంచే కథ నడిపి, ఇప్పుడు దాన్ని క్లైమాక్స్‌కు తీసుకొచ్చారన్నారు.
 
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు... కాంగ్రెస్ సీనియర్ నేతలతో రేవంత్ ఆరు నెలలుగా టచ్‌లో ఉన్నారని, రేవంత్‌ను ఆహ్వానించే విషయంలో మిగతా నాయకుల అభిప్రాయాలను స్వీకరించేనెపంతో కాంగ్రెస్ పార్టీయే ఆయన్ను దూరం పెట్టిందని వ్యాఖ్యానించారు. 
 
ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసివచ్చిన తర్వాత, ఆయన తనను వ్యతిరేకిస్తున్న డీకే అరుణ, కోమటిరెడ్డి వంటి వారి దగ్గరికెళ్లి ప్రాధేయపడ్డారని విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీని వీడాలని ఆయన ఎంతో ముందుగానే అనుకున్నారని, కాంగ్రెస్ కాకుంటే మరో పార్టీలోకి మారుండేవారన్నారు. 
 
అలాగే, తాము తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా ఉన్న వేళ, ఆనాడు ఎన్టీఆర్‌కు నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీకి మరో నాదెండ్లలా తయారయ్యారన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న వేళ, ఢిల్లీకి వెళ్లి, రాహుల్ గాంధీతో చర్చలు జరిపి, నమ్మి పదవులిచ్చిన అధినేతకు ఆయన వెన్నుపోటు పొడిచి అభినవ నాదెండ్లగా మారారని దుయ్యబట్టారు.
 
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని ఆయన చూస్తున్నారని, అది జరిగే పని కాదని అన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ను అన్యాయంగా కేసీఆర్ ఇరికించారని భావించి, రేవంత్‌కు అన్నివిధాలుగా అండగా నిలబడితే, దాన్ని తన స్వార్థానికి వినియోగించుకుని, టీడీపీని బలి ఇవ్వాలని కుట్ర చేశాడని అన్నారు. నాడు ఎన్టీఆర్‌కు నాదెండ్ల, నేడు చంద్రబాబుకు రేవంత్ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.