గంగదేవిపాడులో వైఎస్. షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్. షర్మిల ఆ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా నిలబడ్డారు. ఇందులోభాగంగా, ఆమె ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఇందులోభాగంగా, 20వ తేదీ మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు.
ఖమ్మంలో పర్యటిస్తున్న షర్మిల పెనుబల్లి మండలంలోని గంగదేవిపాడులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కష్టపడి చదివినా ఉద్యోగం రాకపోవడంతో నాగేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని షర్మిల ముందు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. మనో ధైర్యం కోల్పోవద్దని కుటుంబానికి అండగా ఉంటానని షర్మిల హమీ ఇచ్చారు.
కాగా, ఈ దీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు.