'బ్రహ్మోత్సవం' కోసం కాపీ కొట్టిన మహేష్ బాబు... నెటిజన్ల విమర్శలు.. సెటైర్లు!
ప్రిన్స్ మహేష్ బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ''బ్రహ్మోత్సవం''. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మే 7వ తేదీన ఈ చిత్ర ఆడియో వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీనిలో ప్రిన్స్ మహేష్ బైక్‌పై కూర్చున్న లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. కాకపోతే ఈ స్టిల్ కాపీయేనంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చిపడుతున్నాయి. ''బ్రహ్మోత్సవం'' చిత్ర మోషన్ పోస్టర్‌లో మహేష్ వాడిన మూడు చక్రాల బైక్ కొత్తగానే అనిపించినా కూడా అది ఇంతకు ముందే వాడేశారంటూ నెటిజన్లు ఓ వీడియోని పోస్ట్ చేశారు.
రాజస్థాన్ టూరిజం వారు తమ ప్రమోషన్ కోసం ఓ యాడ్‌లో మూడు చక్రాల బైక్‌ని వాడారట. ఇది అచ్చం మహేష్ వాడిన బైక్‌లా ఉండడంతో.. మహేష్ ఆ యాడ్‌నే కాపి కొట్టాడా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ వీడియోపై మహేష్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.