రాఘవేంద్రుడి సినిమా ఫిక్స్, ఇంతకీ ఎవరితో..?
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓం నమో వేంకటేశ సినిమా తర్వాత ఇప్పటివరకు తన కొత్త సినిమాను ఎనౌన్స్ చేయలేదు. నాగశౌర్యతో రాఘవేంద్రరావు సినిమా చేయనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి కానీ.. ఆ సినిమా సెట్ కాలేదు ఆగిపోయింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు తదుపరి చిత్రం గురించి ఇప్పటివరకు ఎలాంటి వార్త బయటకు రాలేదు.
అయితే.. రాఘవేంద్రరావు ట్విట్టర్లో ఈనెల 9వ తారీఖున ముహుర్తం అంటూ ఓ వీడియోను రిలీజ్ చేసారు. దీనిని బట్టి ఆ రోజు రాఘవేంద్రుడు తన కొత్త సినిమాను ఎనౌన్స్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆరోజు నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని తెలియజేయనున్నారు. అయితే... ఈ చిత్రంలో స్టార్లు ఎవరూ నటించడం లేదని దాదాపు అంతా కొత్తవారితో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సుందని సమాచారం. స్క్రిప్టు ఇప్పటికే సిద్ధమైంది.
ఈ సినిమా శ్రీకాంత్ పెళ్లి సందడి టైపులో చిన్న సినిమా. ఆ సినిమాలో సంగీతానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో... అలాగే ఈ సినిమాలో కూడా సంగీతానికి ప్రాధాన్యత ఉంటుంది. నాలుగు గొలుసు కథల సమాహారం ఈ సినిమా అంటున్నారు. దర్శకేంద్రుడు సరైన సక్సస్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరి.. ఈ సినిమాతో ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.