శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (13:15 IST)

ఏపీలో ఇప్పటివరకు మూతపడిన థియేటర్ల సంఖ్య 175

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్ యజమానులు స్వచ్చంధంగా తమ సినిమా హాళ్లను మూసివేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఏకంగా 175 థియేటర్లు మూతపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 980 థియేటర్లు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద థియేటర్‌గా ఉన్న వి-ఎపిక్ థియేటర్‌ను కూడా యజమానులు తాత్కాలికంగా మాసివేసిన విషయం తెల్సిందే. దీంతో ఇటీవల విడుదలైన అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాల ప్రదర్శనకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే, ఈ చిత్రాల కలెక్షన్స్‌పై కూడా ప్రభావం చూపింది. 
 
రాజమండ్రిలో సినిమా థియేటర్ల యజమానుల భేటీ...  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల రాష్ట్రంలోని సినిమా థియేటర్స్ యాజమాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే టిక్కెట్లు విక్రయించాలంటూ షరతు విధించారు. ఈ ధరలకు సినిమాలను ప్రదర్శించలేమని అనేక థియేటర్లు స్వచ్చంధంగా మూసివేస్తున్నారు. అలాగే, సదుపాయాల లేమి నేపథ్యంలో రెవెన్యూ అధికారులు థియేటర్లలో ముమ్మరంగా తనిఖీలు చేస్తూ థియేటర్ యజమానుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో టిక్కెట్ ధరల తగ్గింపు, థియేటర్లతో పాటు ప్రస్తుతం యావత్ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం రాజమండ్రి వేదికగా సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా థియేటర్ యజమానుల జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. ఇందులో అన్ని అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 
కాగా, సినిమా టిక్కెట్ల వ్యవహారంపై హైకోర్టులో ఇప్పటికే విచారణ జరుపుతోంది. సోమవారం ఇదే అంశంపై మరోమారు కోర్టులో విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ ఇపుడు ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
ఐక్యత లేదు : హీరో నాని  
తెలుగు చిత్రపరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయని, అలాంటి వాటిలో సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు అంశం ఒకటన్నారు. ఒక సమస్య వచ్చినపుడు అందరూ ఏకమవ్వాలని కానీ, టాలీవుడ్‌లో ఐక్యత లోపించిందని ఆవేదన వ్యక్తంచేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు సినిమా థియేటర్లు నడుపలేమంటూ అనేక థియేటర్లు స్వచ్చంధంగా మూసివేస్తున్నారు. 
 
అదేసమయంలో హీరో నాని ఈ టిక్కెట్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల కలెక్షన్ కంటే... పక్కనే ఉన్న కిరాణా కొట్ట కలెక్షన్లు బాగున్నాయనే కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
దీంతో హీరో నాని మరోమారు స్పందించారు. ఏపీ సినిమా టిక్కెట్ల ధరలపై తన అభిప్రాయాన్ని వెల్లడించానని, కానీ, తన వ్యాఖ్యలను వివాదాస్పదం చేశారన్నారు. 
 
సాగుతున్న మూతలపర్వం... 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్ల మూతలపర్వం కొనసాగుతోంది. ఇప్పటికే 125కు పైగా థియేటర్లు స్వచ్చంధంగా మూసివేశారు. అలాగే, అధికారులు తనిఖీల్లో సౌకర్యాలు లేవన్నసాకుతో మరికొన్ని థియేటర్లను సీజ్ చేశారు. తాజాగా మరో 30 థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. దీంతో ఏపీలో థియేటర్ల మూతలపర్వం కొనసాగుతోంది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 985 వరకు థియేటర్లు ఉన్నాయి. వీటిలో 125 థియేటర్లు స్వచ్చంధంగా మూసివేశారు. మరో 30 థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు 5 కిలోమీటర్ల దూరంలో దాదాపు 650కి పైగా సీటింగ్ కెపాసిటీ, అతిపెద్ద స్క్రీన్‌తో ఆసియాలోనే రెండో అతిపెద్ద థియేటర్‌గా ఉన్న వి-ఎపిక్‌ మల్టీప్లెక్స్‌ను కూడా మూసివేశారు. 
 
ఈ థియేటర్ ఉన్న ప్రాంతం సి గ్రేడ్ కింద అంటే గ్రామీణ ప్రాంతంలో ఉంటుంది. దీంతో ఈ థియేటర్‌లో కనిష్టంగా రూ.5 గరిష్టంగా రూ.30 ధరలతో సినిమా టిక్కెట్లను విక్రయించాల్సివుంది. ఈ ధరలకు సినిమా థియేటర్ నిర్వహణ అసాధ్యమని భావించిన నిర్వాహకులు థియేటర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. 
 
అలాగే అనేక జిల్లాల్లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు థియేటర్లు నడపడం సాధ్యంకాదని భావించిన యజమానులు స్వచ్చంధంగా తమ థియేటర్లను మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. 
 
నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఇప్పటికే పలు చోట్ల థియేటర్లను సీజ్ చేశారు. కృష్ణా జిల్లాలో అధికారులు 12 థియేటర్లను మూసివేయగా, 18 హాళ్లను యజమానులు స్వచ్చంధంగా మూసివేయించారు. అలాగే, గుంటూరులో 70 థియేటర్లను అధికారులు తనిఖీ చేసి 35 హాళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చారు. వీటిలో 15 థియేటర్ల మూసివేతకు ఆదేశాలు జారీచేశారు.