వర్మకు చంద్రబాబులా... క్రిష్‌కు వెఎస్సార్‌లా కనిపించిన ఆ నటుడు...
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. అలాగే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం సైతం మార్చి 22న విడుదల కానుంది. బాలకృష్ణ తాజాగా నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు గానీ, ఎన్టీఆర్ మహానాయకుడు గానీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌లు బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రానికి, బాలకృష్ణ తీసిన చిత్రానికి ఒక విచిత్రమైన సంబంధం ఉంది. అదేమిటంటే ఒకే వ్యక్తి ఒక చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించి, మరో చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసాడు. ఒకప్పుడు వీరిద్దరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేసారు. అయితే ఆ ఇద్దరినీ ఒక్కరిలో చూసుకునే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కబోతుంది.
‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన శ్రీతేజ్.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు.
మహానటుడు ఎన్టీఆర్‌పై తెరకెక్కిన సినిమాల్లో వైయస్ఆర్, చంద్రబాబు నాయుడు పాత్రలను ఒకే వ్యక్తి పోషించడం విశేషం. అయితే ఇదే నటుడు రామ్ గోపాల్ వర్మ గతంలో తెరకెక్కించిన ‘వంగవీటి’లో దేవినేని నెహ్రూ పాత్రలో కనిపించాడు. మొత్తానికి ఈ నటుడిలో క్రిష్‌కు వై.యస్.రాజశేఖర్ రెడ్డి కనిపిస్తే.. వర్మకు చంద్రబాబు నాయుడు కనిపించడం విశేషం.