శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 30 జూన్ 2019 (10:34 IST)

కింగ్ హోస్ట్ చేసే బిగ్‌బాస్-3 పార్టిసిపెంట్స్ వీరేనా?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా "బిగ్ బాస్-3" రియాల్టీ షో త్వరలో ప్రసారం కానుంది. ఇందులో పాల్గొనే పార్టిసిపెంట్స్ ఎవరో అనధికారికంగా లీక్ అయింది. గత రెండు సీజన్‌లకు జూనియర్ ఎన్టీఆర్, నానిలు హోస్ట్‌లుగా వ్యవహరించారు. మూడో సీజన్‌కు టాలీవుడ్ మన్మథుడు నాగార్జునను నిర్వాహకులుగా ఎంపిక చేయడం గమనార్హం. 
 
కాగా, మూడో సీజన్‌ను తొలి రెండు సీజన్‌ల కంటే... మరింతగా ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని నిర్వాహుకులు అంటున్నారు. ఇక, హౌస్‌లో పార్టిసిపెంట్స్ ఎవరు? ఇదే ఇప్పుడు మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న. అనధికార వర్గాల సమాచారం ప్రకారం, హౌస్‌లోకి వెళ్లే వారు వీరేనని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే నాలుగైదు జాబితాలు వైరల్ అవుతున్నాయి. అయితే, వాటిల్లో ఒకటి మాత్రం దాదాపు కన్ఫార్మ్ అంటున్నాయి టెలివిజన్ వర్గాలు.
 
అనధికారిక సమాచారం మేరకు.. ప్రధాన హౌస్‌లోకి వెళ్లబోయే పోటీదారుల్లో బుల్లితెర టాప్ యాంకర్ శ్రీముఖి, తీన్‌మార్ వార్తలతో దుమ్ము రేపుతున్న జ్యోతి అలియాస్ సావిత్రి, టాలీవుడ్ లవర్ బాయ్, ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగిన తరుణ్, తన స్టెప్పులతో అదరగొట్టే డ్యాన్స్ మాస్టర్ రఘు, బేస్ వాయిస్‌తో కుర్రకారును ఓ ఊపు ఊపేసిన సింగర్ హేమచంద్ర, వివాదాలకు కేంద్రబిందువుగా మారి, టాలీవుడ్‌ను షేక్ చేసిన నటి శ్రీరెడ్డి ఈ సీజన్‌లో పోటీదారులుగా ఉంటారని భావిస్తున్నారు.
 
వీరితో పాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్, టాప్ యాంకర్ ఉదయభాను, గతంలో మంచి హిట్‌లు సాధించినా, ఇటీవలి కాలంలో అవకాశాలను అందిపుచ్చుకోలేని నటుడు వరుణ్ సందేశ్, కమేడియన్ వైవా హర్ష, యాంకర్ లాస్య కూడా ఉంటారట. ఇదే సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, 'మహాతల్లి' ఫేమ్ జాహ్నవి కూడా హౌస్‌లో ఉంటారనే వార్తలు వస్తున్నాయి.