శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2019 (14:11 IST)

బిగిల్ హీరోకు బాంబు బెదిరింపు.. ఇంటివద్ద తనిఖీలు.. యువకుడి అరెస్ట్

కోలీవుడ్ స్టార్ హీరో, మెర్సల్, బిగిల్ కథానాయకుడు విజయ్‌కి బాంబు బెదిరింపు వచ్చింది. విజయ్ నటించిన బిగిల్ చిత్రం దీపావళికి విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ  నేపథ్యంలో విజయ్ ఇంటివద్ద బాంబు పెట్టామని... ఆ బాంబు కొద్ది గంటల్లోనే పేలనుందని అజ్ఞాతవ్యక్తి నుండి చెన్నై కంట్రోల్ రూంకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు విజయ్ ఇంటికి చేరుకున్నారు. చెన్నైలోని పనైయూర్ ప్రాంతంలో విజయ్ ఇల్లు ఉండగా, ఇల్లంతా తనిఖీలు చేశారు. 
 
అయితే బాంబ్ మాత్రం దొరకలేదు. ఎందుకైనా మంచిదని ఆయన ఇంటి చుట్టూ భారీగా భద్రత ఏర్పాటు చేశారు. అనంతరం విజయ్ తండ్రి ప్రముఖ నిర్మాత చంద్రశేఖర్ నివాసానికి కూడా పోలీసులు వెళ్లారు. అక్కడ కూడా తనిఖీలు చేశారు. అయితే అక్కడ బాంబ్ జాడ లేకపోవడంతో అది గాలి వార్త అని పోలీసులు తేల్చారు. ఆ తర్వాత ఫోన్ కాల్‌ను ట్రేస్ చేసిన పోలీసులు అళపాక్కమ్ ప్రాంతంలోని పోరూర్ సమీపం నుంచి ఆ కాల్ వచ్చినట్లు గుర్తించారు. 
 
ఫోన్ చేసిన కుర్రాడిని అదుపులోకి తీసుకొని విచారించగా, ఆయన పొంతన లేని సమాధానాలు చెబుతూ పోలీసులనే అయోమయానికి గురి చేస్తున్నాడని తెలిసింది. దీనిపై సీరియస్ విచారణ చేపడతామని చెన్నై పోలీసులు అంటున్నారు.