బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (17:03 IST)

కొత్తగా సినిమాల్లో అడుగుపెట్టేవారి మొదటి మెట్టు... కేరాఫ్ కంచరపాలెం...

స్టార్‌ హీరోలు అవసరం లేదు. పేరున్న హీరోయిన్‌‌తో అస్సలు పనిలేదు. భారీ సెట్టింగులతో అవసరమే లేదు. జిగేలుమనిపించే కాస్ట్యూమ్‌తో పనిలేదు. మన చుట్టూవున్న మనుషులే నటీనటులు. మనం నిత్యం తిరుగాడే ప్రదేశాలే లొకేషన్లు. మన ఇళ్లు, ఆలయం, స్కూలు, గ్రౌండ్‌, రోడ్డు… ఇ

స్టార్‌ హీరోలు అవసరం లేదు. పేరున్న హీరోయిన్‌‌తో అస్సలు పనిలేదు. భారీ సెట్టింగులతో అవసరమే లేదు. జిగేలుమనిపించే కాస్ట్యూమ్‌తో పనిలేదు. మన చుట్టూవున్న మనుషులే నటీనటులు. మనం నిత్యం తిరుగాడే ప్రదేశాలే లొకేషన్లు. మన ఇళ్లు, ఆలయం, స్కూలు, గ్రౌండ్‌, రోడ్డు… ఇవి సరిపోతాయి. కావాల్సిందల్లా మంచి కెమెరా. మంచి పనితనం ఉన్న కెమెరామన్‌. కేరాఫ్‌ కంచరపాలెం సినిమా చూస్తే ఇదే భావన కలుగుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కంచరపాలెం ఒక ప్రయోగం. కొత్త దర్శకుడు వెంకటేష్‌ మహా చేసిన విజయవంతమైన ప్రయోగం.
 
గతవారం విడుదలైన కేరాఫ్‌ చంచరపాలెం సినిమాపై పత్రికలు పెద్దపెద్ద సమీక్షలే రాశాయి. ఈ సినిమాను ఆకాశానికెత్తాయి. కంచరపాలెంలో మనకు తెలిసిన ఒక ముఖమూ కనిపించదు. ఏనాడూ సినిమాల్లో నటించాలన్న కోరిక కలిగిన వాళ్లూ కాదు. అనుకోకుండా అవకాశం వచ్చి నటించిన అతి సామాన్యులు. సినిమా మొత్తంమ్మీద ఎక్కడా చిన్న సెట్టింగ్‌ వేసిన దాఖలాలు కనిపించవు. విశాఖపట్నంలో ఓ ప్రాంతమైన కంచరపాలెంలోని కొన్ని వీధులు, ఇళ్లు, రోడ్లు, ఆలయం ఉపయోగించుకుని సినిమా తీసేశారు. సినిమా చివర్లో ఈ సినిమా కథానాయకుడు రాజు (సుబ్బారావు) మొదటి రాత్రి సీన్‌ ఒకటుంది. ఆ సీన్‌లో మాత్రం ఇంటి గోడలకు కొంత అలంకరణ చేసినట్లు కనిపిస్తుంది. ఇంకెక్కడా సెట్టింగుల కోసం పైసా ఖర్చు చేసినట్లు అనిపించదు.
 
స్టార్‌ నటీనటులు లేకున్నా, సెట్టింగులు గట్రా లేకున్నా సినిమా ఇంతగా ఎందుకు విజయం సాధించింది? కథను ఆకట్టుకునేలా చెప్పడమే దర్శకుని ప్రతిభ వల్లే అని చెప్పాలి. హైస్కూల్‌ విద్యార్థులు సుందరం-నీనీత, క్రిస్టియన్‌ కుర్రాడు జెసెఫ్‌-బ్రాహ్మణ అమ్మాయి భార్గవి; స్కూల్‌లో అటెండరుగా పనిచేసే రాజు - అదే స్కూల్‌లో కార్యాలయ ఉద్యోగి అయిన ఒరియా మహిళ రాధ; బ్రాందీ షాపులో పనిచేసే గెడ్డం- వేశ్యావృత్తిలో ఉండే సలీమ… ఈ నాలుగు జంటల ప్రేమ కథలు సమాంతరంగా నడుస్తుంటాయి. 14 ఏళ్ల వయసు ప్రేమ కథ ఒకటైతే, 25 ఏళ్ల ప్రేమకథ ఇంకొకటి, ఇంకొకటి 35 ఏళ్ల వయసు ప్రేమ కథ, మరొకరి 50 ఏళ్ల ప్రేమకథ. చివర్లో ఈ ప్రేమకథలన్నీ 50 ఏళ్ల వయసులోని స్కూల్‌ అటెండర్‌ రాజు ప్రేమకథలే అని క్లైమాక్స్‌ దాకా ప్రేక్షకులకూ తెలియదు. ఈ నాలుగు ప్రేమకథలు ఎలా మొదలయ్యాయి, ఎలా ముగిశాయి అనేది తెరపైన చూస్తేనే బాగుంటుంది.
 
ఈ కథలు చెప్పేటప్పుడు దర్శకుడు సున్నితమైన అంశాలను నర్మగర్భంగా స్పృసించారు. సంభాషణలు చాలా తేలిగ్గా పలికినట్లు నిపించినా…. అందులో లోతైన భావం కనిపిస్తుంది. అటెండర్‌ రాజు… తనకు దేవుడి కంటే మనుషులపైనే నమ్మకం, విశ్వాసం అని చెబుతారు. తనకు రోజూ సాయం చేస్తూ తోడుగా ఉండే మనుషుల గురించి చెబుతారు. ఆ నాలుగు మాటల సంభాషణలోనే గొప్ప ఫిలాసఫీ గోచరిస్తుంది. ఇక క్రిస్టియన్‌ యువకుడిని ప్రేమించినందుకు భార్గవిని మందలించే ఆమె తండ్రి…. అదే మతానికి చెందిన ఓ వ్యక్తి వద్ద ఎల్‌ఐసి పాలసీ చేసేటప్పుడు మాత్రం అతని మతం ఏమిటో తెలిసినా పట్టించుకోరు. ఆర్థిక వ్యవహారాల్లో మతం అడ్డురాదు అనే అర్థం ఆ చిన్న సన్నివేశంలో చెప్పకనే చెబుతారు. సలీమా కళ్లను మాత్రమే చూసి ప్రేమించే గెడ్డం… ఆమె వేశ్య అని తెలిసినా వివాహం చేసుకోడానికి సిద్ధపడుతాడు. దీని ద్వారా నిజమైన ప్రేమ గొప్పదనాన్ని చెబుతారు. దర్శకుడి ప్రతిభకు నిదర్శనమైన ఇటువంటి సన్నివేశాలు, సంభాషణలు చాలానే ఉన్నాయి. ఆలోచించే వారికి విలువైన సందేశమూ కేరాఫ్‌ కంచరపాలెంలో వినిపిస్తుంది.
 
ఈ చిత్రంలోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అన్నీ జానపద గీతాల బాణీలో సాగేవే. అన్ని సినిమాల్లో హీరో-హీరోయిన్లు అందమైన లొకేష్లకు వెళ్లి పాడుకునే గీతాలు ఇందులో కనిపించవు. అన్ని గీతాలు నేపథ్యంగానే సాగిపోతూ…. కథను, సన్నివేశాన్ని బలోపేతం చేస్తుంటాయి. ఆ బాణీలు కూడా వినసొంపుగా ఉన్నాయి. జానపద గీతాలు విన్నట్లు కాకుండా… ఏదో కొత్త పాటలు విన్నట్లు అనిస్తుంది. సినిమాలో అటెండర్‌ రాజు పాత్ర పోషించిన సుబ్బారావు స్వయంగా జానపద కళాకారుడు కావడం వల్ల అతనితోనే పాటలు పాడించారట.
 
మొత్తంగా కెరాఫ్‌ కంచరపాలెం గురించి చెప్పేదేమంటే… సినిమా తీయాలనుకునే వారికి కచ్చితంగా ఇది ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఇటువంటి సినిమాల మాదిరిగా మరికొన్ని కచ్చితంగా వస్తాయి. కొత్త దర్శకులు ధైర్యంగా ముందుకువస్తారు. కొత్త నటీనటులు తెలుగుతెరకు పరిచయం అవుతారు. అందుకే ముందే చెప్పినట్లు ఇది సినిమా ప్రయోగానికి కేరాఫ్‌ అవుతుంది.