శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (10:04 IST)

సంతృప్తికరమైన శాఖాహారభోజనం 'శతమానంభవతి' : చిరంజీవి

శర్వానంద్ - అనుపమపరమేశ్వరన్ జంటగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మించిన చిత్రం "శతమానంభవతి". ఈ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. 'శతమానంభవతి' చిత్రం సంతృప్తికరమైన శాఖా

శర్వానంద్ - అనుపమపరమేశ్వరన్ జంటగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మించిన చిత్రం "శతమానంభవతి". ఈ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. 'శతమానంభవతి' చిత్రం సంతృప్తికరమైన శాఖాహారభోజనం అని హీరో చిరంజీవి అన్నారు. 
 
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో హైదరాబాద్‌లో ఈ చిత్ర విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్ సినిమాతో నిర్మాతగా తమ సంస్థకు తొలి విజయాన్ని అందించిన దర్శకుడు వి.వి.వినాయక్‌ను చిరంజీవి చేతులమీదుగా దిల్‌రాజు సన్మానించారు. 
 
ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ... 'దిల్' అనే పేరును రాజుకు ఏ ముహూర్తాన పెట్టారో కానీ అదే ఆయన ఇంటిపేరయింది. దిల్ అనే మాటకు ఆయన పూర్తి అర్హుడు. దిల్‌కు రెండువైపులా పదునుంది. ఒకవైపు దమ్మున్న సినిమాలు చేస్తూనే మరోవైపు మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాల్ని నిర్మిస్తున్నారు. ఆయనతో పనిచేయడానికి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో సిద్ధంగా ఉన్నారు. హీరోల ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో కాకుండా మంచి సినిమాను తీయాలనే సంకల్పం, తపన దిల్‌రాజులో కనిపిస్తాయి. తన మూలాలను మర్చిపోకుండా జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించడంతో పాటు నిర్మాతగా తనకు బాధ్యతలను నేర్పిన వినాయక్‌ను గుర్తుపెట్టుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. 
 
సంతృప్తికరమైన శాఖాహార భోజనంలా శతమానంభవతి ఆకట్టుకుంటుంది. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో 1, 2, 3లలో ఈ చిత్రానిది ఏ స్థానమో చెప్పలేను కానీ మంచి సినిమాగా అందరి మనసుల్ని గెలవడం ఆనందంగా ఉంది. చరణ్‌కు శర్వానంద్ ఆప్తమిత్రుడు. వాణిజ్య ప్రకటనలో తొలిసారి అతడు నాతోనే నటించాడు. శర్వానంద్‌కు దక్కిన ఈ విజయాన్ని తలుచుకుంటే నా బిడ్డకు దక్కినంత ఆనందంగా ఉంది అని అన్నారు.