మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 13 జనవరి 2025 (17:15 IST)

గేమ్ చేంజర్ పైరసీ ప్రింట్ లీక్ పై సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్

Game Changer Piracy
Game Changer Piracy
కోట్లకు కోట్ల రూపాయల ఖర్చుచేసి గ్లోబల్ రేంజ్‌లో ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో మూడేళ్లకు పైగా కష్టపడి చేసిన సినిమా విడుదల రోజు నెట్టింట లీక్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ నిర్మించిన 'గేమ్ చేంజర్ విడుదల రోజే ఆన్‌లైన్‌లో పైరసీ ప్రింట్ లీక్ అయ్యింది. దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఒక ముఠా ఉంది. 
 
'గేమ్ చేంజర్' విడుదల ముందు నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులు కొందరికి సోషల్ మీడియా, అలాగే వాట్సాప్‌లలో కొంత మంది నుంచి బెదింపులు వచ్చాయి. తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని గొడవకు దిగారు. 'గేమ్ చేంజర్' విడుదలకు రెండు రోజుల ముందు సినిమాలో కీలక ట్విస్టులను సోషల్ మీడియా అకౌంట్‌లలో షేర్ చేశారు. ఇక విడుదలైన తర్వాత హోచ్‌డి ప్రింట్ లీక్ చేయడమే కాదు... టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ షేర్ చేశారు. 
 
'గేమ్ చేంజర్' చిత్ర బృందాన్ని బెదిరించిన, పైరసీ ప్రింట్ లీక్ చేసిన 45 మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసింది టీం. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి 'గేమ్ చేంజర్' మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారా? పైరసీ ప్రింట్ లీక్ చేశారా? లేదంటే వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ కేసును టేకప్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
 
సోషల్ మీడియా (ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌ బుక్, యూట్యూబ్) పేజీలలో ఒక పథకం ప్రకారం 'గేమ్ చేంజర్' మీద పలువురు నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటు కీలకమైన ట్విస్టులు రివీల్ అయ్యేలా చేసి ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేయకుండా చేశారు. సదరు పేజీల మీద కూడా కంప్లైంట్స్ నమోదు చేశారు. త్వరలో ఆ సోషల్ మీడియా పేజీల మీద కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలియచేశారు.