రామారావు గారి తర్వాత మళ్లీ అంత ఇమేజ్ వచ్చింది వై.ఎస్ గారికే: దిల్ రాజు
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర కథాంశంగా రూపొందిన సంచలన చిత్రం యాత్ర. ఈ చిత్రానికి మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. మలయాళ అగ్రహీరో మమ్ముట్టి వై.ఎస్ పాత్ర పోషించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన యాత్ర చిత్రాన్నిఈ నెల 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర ఎంత సెన్సేషన్ అయ్యిందో.. తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలుసు. దాన్ని ఐడియాగా తీసుకుని పాదయాత్రలో ఉన్న ఎమోషన్స్, మూమెంట్స్‌ను తీసుకుని మహి రెడీ చేసిన స్ర్కిప్ట్‌కి మా విజయ్ ప్రొడ్యూస్ చేయడం.. లెజండరీ యాక్టర్ మమ్ముట్టి గారు నటించడంతో.. టీజర్ రిలీజ్ అయినప్పుడు.. సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు ఎగ్జైట్మెంట్ కనిపించింది. నిర్మాత విజయ్‌కి, డైరెక్టర్ మహికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను.
మంచి సినిమా రాబోతుందని అనిపిస్తుంది. రిలీజ్‌కి రెండు రోజులు ముందు నుంచి ఓవర్సీస్ లోను, ఇక్కడ ఆన్‌లైన్ బుకింగ్స్ చూస్తుంటే వెరీ స్ట్రాంగ్ ఓపెనింగ్ రాబోతుందని తెలుస్తుంది. ఓపెనింగ్ తీసుకుంటేనే రెవెన్యూ బాగుంటుంది. ఆ మ్యాజిక్ జరుగుతోంది. ఓపెనింగ్ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఒకప్పుడు సినిమా ఫరవాలేదు బాగానే ఉంది అంటే మెల్లగా ఇంఫ్రూవ్‌మెంట్ ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఓపెనింగ్ తీసుకుంటేనే సినిమా.
అలాంటి యాత్రకు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని నైజం, వైజాగ్ ఏరియాల్లో మా సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రలో జరిగిన మూమెంట్స్ ఆరోజుల్లో టీవీల్లో పేపర్లలో చదివాం. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు హీరో అయ్యారు. పాదయాత్ర తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి లైఫే మారిపోయింది. రామారావు గారి తర్వాత మళ్లీ మన రాష్ట్రాల్లో అంత ఇమేజ్ వచ్చింది జనాల్లో వై.ఎస్ గారికే. అలాంటి రాజశేఖర్ రెడ్డి గారి ఇతివృత్తంతో వస్తోన్న ఈ యాత్ర పెద్ద హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.