తారకరత్న ఆరోగ్యం గురించి నేను చెప్పేదికాదు : కళ్యాణ్ రామ్
నందమూరి తారకరత్న ఇటీవలే నారా లోకేష్ పాద యాత్ర సందర్భంగా యాత్ర మొదలు పెడుతున్న కొద్దిసేపటికే కల్ళుతిరిగి పడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ప్రముఖ డాక్టర్లు పరీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా నందమూరి కుటుంబమంతా హాజరయింది. కళ్యాణ్ రామ్ కూడా వెళ్ళి చూసి వచ్చారు. ఆసుపత్రివారు అప్పట్లో రోజుకో హెల్త్ బులిటెన్ విడుదల చేసేవారు.
కాగా, బుధవారంనాడు కళ్యాణ్ రామ్ తన సినిమా అమిగోస్ ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడారు. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్యం గురించి అడుగగా, ఆ విషయం నేను చెప్పేదికాదు. ఆసుపత్రి వర్గాలే తెలియజేయాలని అన్నారు. దీనిని బట్టి ఇంకా తారకరత్న ఆరోగ్యం కుదుటపడలేదని తెలుస్తోంది. మరోవైపు విదేశాలకు తారకరత్నను తరలించే యోచనలో వున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇక దీనిపై ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ ఇవ్వడం కూడా ఆపేశాయి.