ఏదో లవ్ స్టోరీ అనుకున్నా. కానీ విరూపాక్ష కథ చెప్పి భయపెట్టాడు డైరెక్టర్ కార్తీక్ : సాయి ధరమ్ తేజ్
Sai Dharam Tej, Samyukta Menon and others
'2019లో ఈ కథ విన్నాను. చిన్న ఆఫీస్‌లో ఈ కథ విన్నాను. ముందుగా సుకుమార్ నుంచి కాల్ వచ్చింది. కథ విను.. కచ్చితంగా నీకు నచ్చుతుంది. చేస్తావ్ అని అన్నారు. సుకుమార్ గారు కదా?.. ఏదో లవ్ స్టోరీ చెబుతారని అనుకున్నా. కానీ నన్ను భయపెట్టాడు డైరెక్టర్ కార్తీక్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అప్పుడే ఫిక్స్ అయ్యాను` అని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు.
సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలకు స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి పాత్రలను పరిచయం చేస్తూ నిర్వహించిన కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొంది.
సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాను చూసి మా అమ్మ, మీ అమ్మగారు గర్వంగా చెప్పుకుంటారు. ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. దర్శకుడు కార్తీక్‌కు హ్యాట్సాఫ్. శ్యాం గారి కెమెరా పనితనానికి హ్యాట్సాఫ్. నాగేంద్ర గారి ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంది. విరూపాక్ష ప్రపంచాన్ని అద్భుతంగా రూపొందించారు. కార్తీక్ విజన్‌కు అజనీష్ ప్రాణం పోశారు. బీజీఎం అదరగొట్టేశారు. పాటలు బాగా వచ్చాయి. సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నటీనటుల సహకారంతోనే నేను నటించగలిగాను. సునిల్, సాయి చంద్, బ్రహ్మాజీ, అజయ్, సంయుక్త ఇలా అందరూ నాకు ఎంతగానో సహకరించారు. నాకు సెట్‌లో ఆరోగ్యం బాగా లేకపోయినా నాకోసం షూటింగ్ క్యాన్సిల్ చేశారు. మా నిర్మాతలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నన్ను సపోర్ట్ చేసిన విరూపాక్ష టీం, సుకుమార్ గారికి థాంక్స్. ఈ సినిమాకు కథే హీరో. హారర్ సినిమా చూడటమే ఓ చాలెంజింగ్. నటించడం ఇంకా పెద్ద చాలెంజ్. తారక్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. మేం చాలా క్లోజ్‌గా ఉంటాం. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ కావాలని అడిగిన వెంటనే ఇచ్చారు. నా కోసం, నిర్మాత బాపి గారి కోసం, సుకుమార్ గారి కోసం వెంటనే ఓకే చెప్పారు. ఇప్పుడు సినిమాను చూసే విధానం మారింది కాబట్టి. మంచి సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేద్దామని అనుకున్నాం. ఓ ఫిక్షన్ స్టోరీ అందరికీ రీచ్ అవుతుందని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నాం.
సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో నేను నందిని అనే పాత్రను పోషించాను. రెండేళ్ల క్రితం నాకు ఈ స్టోరీని వినిపించారు. నాకు ఈ పాత్ర ఎంతగానో నచ్చింది. నందిని పాత్ర కోసం నా ప్రాణం పెట్టేశాను. ప్రతీ పాత్రను ఎంతో డీటైలింగ్‌గా చూపించారు. షూటింగ్ ఫస్ట్ రోజు ఎంతో నెర్వస్‌గా ఫీల్ అయ్యాను. ఈ పాత్ర కోసం చెప్పులు వేసుకోకుండా నటించాను. ఇలాంటి పాత్ర దక్కడం గొప్ప అదృష్టం. ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్' అని అన్నారు.
కార్తిక్ దండు మాట్లాడుతూ.. 'ఈ సినిమా కథను 2018లో రాశాను. రంగస్థలం షూటింగ్‌లో ఉన్న సుకుమార్ గారికి ఈ కథను చెప్పాను. కరోనా వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ కరోనా గ్యాప్‌లో కథను ఎక్కడా మార్చలేదు. యాక్సిడెంట్ తరువాత తేజ్ గారిలో తెలియని ఓ భయం ఉండేది. సెట్‌లో ఫస్ట్ డే రోజు తేజ్ గారు మాటలు సరిగ్గా రావడం లేదని, దాని ద్వారా వేరే వాళ్లకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? అనే భయంలో ఉండేవారు. కానీ నాలుగో రోజు వచ్చి అదరగొట్టేశారు. టెక్నీషియన్స్ అందరికీ రుణపడి ఉంటాను. టీం అంతా కూడా ఎంజాయ్ చేస్తూ సినిమాను చేశాం. ఈ సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశామ' అని అన్నారు.
నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు టెక్నీషియన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇది మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. నేను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాను. ఎప్పుడూ కథను నమ్మే సినిమాలు చేశాను. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అందుకే పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తున్నామ'ని అన్నారు.
సాయిచంద్ మాట్లాడుతూ.. 'నేను ఇంత వరకు ఇలాంటి పాత్రను పోషించలేదు. పూజారిలా పూర్తి ఆధ్యాత్మిక భావనలో ఉన్న పాత్రను చేయడంతో నాపై ఎంతో ప్రభావాన్ని చూపించింది. విరూపాక్ష పూర్తి విభిన్నమైన సినిమా. ఈ సినిమాకు మంచి టీం కుదిరింది. ప్రతీ రోజూ ఎంతో అద్భుతంగా అనిపించింది. సాయి తేజ్‌తో నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. సాయి తేజ్ బ్రదర్ వైష్ణవ్‌తో ఉప్పెన, కొండపొలం సినిమాలు చేశాను. సాయి తేజ్ చాలా మంచి వ్యక్తి. దర్శకుడు కార్తిక్ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తీశారు' అని అన్నారు.
అజయ్ మాట్లాడుతూ.. 'విరూపాక్షతో ఆడియెన్స్ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. ఎంతో మిస్టీరియస్‌గా ఉంటుంది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. కార్తీక్ ఈ సినిమా కోసం పెట్టిన శ్రమ ఏంటో అందరూ ఏప్రిల్ 21న చూడబోతోన్నారు. మొదటి ఇరవై నిమిషాల్లోనే విరూపాక్ష ప్రపంచంలోకి వెళ్తారు' అని అన్నారు.