దిల్ రాజు ఆస్తులపై ఐటి దాడులు- వెంకటేష్ తో సినిమా ప్రచారం.. ఆంతర్యం?
తెలుగు సినిమా రంగంలో లేటెస్ట్ టాపిక్ ఇన్ కమ్ టాక్స్ దాడులు. ఇవి కొత్తకాకపోయినా సహజంగా జరిగే పరిణామాలే అని నిర్మాతలు అంటున్నారు. లోగడ నిర్మాత నాగవంశీ పైన కూడా ఐ.టి. దాడులు జరిగాయి. దాడుల చేశాక అధికారులు ఎటువంటి సమాచారం మీడియాకు ఇవ్వలేదు. వచ్చారు. చేశారు. వెళ్ళిపోయారు అన్నట్లుగా వుంది. ఇలా చాలామంది ఇండ్లలో, ఆఫీస్ ల్లో దాడులు జరగడం మామూలే. అయితే ఈసారి జరిగిన ఐ.టి.దాడులు ప్రత్యేకత సంతరించుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీసిన దిల్ రాజు ఆస్తుల వ్యవహారంలో తప్పుడు లెక్కలు వున్నాయంటూ గత మూడు రోజులుగా దాడులు కొనసాగించడం హైలైట్.
కాగా, ఆ సినిమాకు సంబంధించి సక్సెస్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఒకరోజు దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ, తదుపరి రోజు సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. మరో రెండురోజుల్లో మరో విజయయాత్ర వుండనున్నదని సమాచారం. ఇలా ఒకవైపు దాడులు, మరోవైపు ప్రచారం ఏమిటి ఆంతర్యం అంటే... ఐటి. దాడులకు ప్రమోషన్ కు సంబంధంలేదనీ, మీరు ప్రమోషన్ చేసుకోండని దిల్ రాజే స్వయంగా చెప్పారని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పటికే జమాఖర్చులలో తేడాలున్నాయని భావించిన ఐ.టి. అధికారులకు ఈ ప్రమోషన్ కు అయ్యే ఖర్చులు, స్టార్ హోటల్స్ లో జరిగే ఈవెంట్ల ఖర్చులుకూడా జతచేసి చూపిస్తారని తెలుస్తోంది.
ఇక ఐ.టి. దాడుల తర్వాత రెమ్యునరేషన్ విషయంలో వెంకటేష్ మాట్లాడుతూ, నాదంతా వైట్ మనీనే అమ్మా.. ఎక్కడా బ్లాక్ మనీ వుండదూ అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇతర హీరోల సంగతి నాకు తెలీదు అంటూ తెలివిగా సమాధానం చెప్పారు.
అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ వుంది. జిడ్డు క్రిష్ణ మూరిని స్పూర్తిగా తీసుకుని ఆయన జీవితాన్ని సాగించే విక్టరీ వెంకటేష్ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఇదంతా మాయ అంటుంటారు. ఓ యోగి ఆత్మకథను తన దగ్గరికి వచ్చే మీడియావారికి కూడా చెబుతుంటాడు. ఎనప్పుడు కలిసినా వేదాంత ధోరణి కలిపి మాట్లాడే వెంకటేష్ ఈసారి మాత్రం తన సినిమా ప్రమోషన్ సందర్భంగా ఒక్కమాట కూడా ఆద్యాత్మికంగా మాట్లాడకపోవడం విశేషం. మరో విశేషం ఏమంటే, ఏ సినిమా చేసినా ఆ తర్వాత ప్రమోషన్ గురించి పెద్దగా పట్టించుకోడు. ఒకసారి సినిమాచేశాం. అంతే. తర్వాత మరోదాని గురించి ఆలోచిస్తాం. అది ప్లాప్ అయినా హిట్ అయినా ఒక్కలాగే చూసుకుంటానంటూ ప్రకటనలు జారీ చేసిన సందర్భాలు చాలా వున్నాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం విషయంలో మొదటినుంచి పబ్లిసిటీ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. సినిమా విడుదలతర్వాత కూడా అంతకంటే కేర్ తీసుకున్నారు.
మరి ఆయన గతంలో చెప్పిన నీ పని నువ్వుచేయి ఫలితం ఆశించకు.. అనే బోధలు ఏమయ్యాయో.. అంటూ ఫిలింనగర్ లో కథనాలు వినిపిస్తున్నాయి. వెంకటేష్ ను అనిల్ రావిపూడి మార్చాడా? అనే సందేహం కూడా కలిగింది. అందుకు కూడా వెంకీ క్లారిటీ ఇస్తూ, ఈ సినిమాకు సీక్వెల్ కూడా చేయాలనుంది. అనిల్ కథ రెడీ చేస్తే నేను సిద్ధంగా వున్నాను. మా ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ వుందంటూ చెప్పారు. సో.. వెంకటేష్ రూటు మార్చారన్నమాట.