డాడీ కాలుకు చిన్న సర్జరీ జరిగింది : శృతి - అక్షర
విశ్వనటుడు కమల్ హాసన్. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరు శృతిహాసన్ కాగా, మరొకరు అక్షర హాసన్. అయితే, కమల్ హాసన్ కాలికి చిన్నపాటి సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఆయన కుమార్తెలిద్దరూ ఓ ప్రకటనలో మంగళవారం వెల్లడించారు.
"శభాష్ నాయుడు" షూటింగ్ సమయంలో కమల్ హాసన్ ప్రమాదానికి గురయ్యారు. అపుడు ఆయన కాలుకు శస్త్ర చికిత్స జరిగింది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పినా... కమల్ హాసన్ అవేమి పట్టించుకోకుండా తనపనులు చేసుకుంటూ వెళ్లారు. ఇప్పుడు ఆ గాయం తిరగపెట్టడంతో సినిమాలు, రాజకీయాలకు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చి శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
"అందరి ప్రేమ, అభిమానం, ఆశీర్వాదం వలన తమ తండ్రి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసిందని, మరో నాలుగైదు రోజులలో తిరిగి ఇంటికి వస్తారని శృతి హాసన్, అక్షర ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు. నాన్నగారి ఆరోగ్యం విషయంలో శ్రీ రామచంద్ర ఆసుపత్రి చాలా కేర్ తీసుకున్నారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంటూ శృతి, అక్షర పేర్కొన్నారు. అతి త్వరలోనే నాన్నగారు మిమ్మల్ని కలుస్తారు. మీరు చూపించే ప్రేమ, అందించే ధైర్యం వలన నాన్న త్వరగా కోలుకుంటున్నారు అని లేఖలో తెలియజేశారు.
కాగా, ఈ యేడాది ఏప్రిల్‌లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 సీట్లలో పోటీ చేసేందుకు కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ సిద్ధమైంది. ఈ పార్టీకి టార్చ్ లైట్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ గుర్తుపైనే అన్ని సెగ్మెంట్లలోనూ ఎంఎన్ఎం పోటీ చేయనుంది.