సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు
బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన పాపులర్ నటుడు సొహైల్. యాంగ్రీ మ్యాన్ గా బిగ్ బాస్ హౌజ్లో చూపించిన ఆటతీరుకు లక్షలాది మంది ఆయనకు ఫ్యాన్స్ అయిపోయారు. టాప్ 3 లో ఒకడిగా ఉన్న సొహైల్ మంచి గేమ్ ఆడి తెలివిగా క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడు. మెగా స్టార్ చిరంజీవి ప్రశంస ను పొందిన సోహైల్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక సేవా కార్యక్రమాల ద్వారా మరింత అభిమానాన్ని పొందుతున్నారు.
సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా ఆయన ఇప్పటివరకు చాలామందికి సహాయం చేయగా ప్రస్తుతం లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న వారికి రేషన్, భోజన సదుపాయాలు సమకూరుస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ప్రజలతో సోహైల్ పంచుకున్నారు. తన ఇన్స్టా లో ఓ వీడియో ద్వారా ఈ సంస్థ పనితీరు వెల్లడించారు. దీన్ని వెనుక ఉండి నడిపించిన వారిని ప్రశంసించారు.
సోహైల్ మాట్లాడుతూ, "సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇప్పటి వరకు చాలా సేవా కార్యక్రమాలు చేశాం. భవిష్యత్ లో కూడా ఇలానే చేస్తాం. దానికి మీ ఆశీర్వాదాలు కావాలి. కొన్ని రోజుల్లో వందమంది జూనియర్ ఆర్టిస్ట్ లకు రేషన్, సరుకులు అందించబోతున్నాం. మా చారిటీ సంస్థ ద్వారా నాలుగు ఆపరేషన్స్ ని విజయవంతంగా పూర్తి చేశాం. వాటిలో ఒకటి న్యూరో సర్జరీ కాగా మరో మూడు హార్ట్ ఆపరేషన్స్. ఇప్పటి వరకు 24 లక్షలకు పైగా ఖర్చు పెట్టి చారిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించాం. ఇంత గొప్ప కార్యక్రమానికి ముందు నుంచి సపోర్ట్ గా ఉన్న సోహిలియన్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని, అందరికీ అందుబాటు లో ఉండేలా సహాయపడతాము" అని అన్నారు.