పవన్ కళ్యాణ్ 'ఓజీ' - నాగ చైతన్య 'తండేల్'ను దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్!!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించే కొత్త చిత్రం ఓజీ, అక్కినేని నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది.
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' (ఒరిజనల్ గ్యాంగ్‌స్టర్), అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం 'తండేల్' సినిమాల స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాలకు సంబంధించిన వివరాలను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
థియేట్రికల్ రన్ తర్వాత ఒప్పందం మేరకు నెట్‌ఫ్లిక్స్‌లో ఇవి స్ట్రీమింగ్ అవుతాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రానున్నాయని పేర్కొంది. ఈ సినిమాలకు సంబంధించి పోస్టర్లను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. దీంతో 'ఓజీ', 'తండేల్' ఓటీటీ ఫ్లాట్ఫామ్ పక్కాగా ఫిక్స్ అయినట్లేనని తేలిపోయింది.
పవన్ కల్యాణ్ నటిస్తున్న 'ఓజీ' చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్ కథానాయికలుగా ఉన్నారు. అలాగే, నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న 'తండేల్' చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.