శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శనివారం, 4 ఫిబ్రవరి 2017 (14:34 IST)

వామ్మో బాలయ్యతోనా... రెండు గంటల ముందొచ్చి పడిగాపులు గాసినా వచ్చేవాడు కాదు

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో క్రిష్ బాలయ్య సమయపాలనపై ప్రశంసల జల్లు కురిపించాడు. రోజూ ఉదయం సరిగ్గా 7 గంటలకు ఆయన సెట్‌లో ఉండేవారని, మిగిలిన వారంతా ఆయన్ని ఫాలో అయ్

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో క్రిష్ బాలయ్య సమయపాలనపై ప్రశంసల జల్లు కురిపించాడు. రోజూ ఉదయం సరిగ్గా 7 గంటలకు ఆయన సెట్‌లో ఉండేవారని, మిగిలిన వారంతా ఆయన్ని ఫాలో అయ్యేవారని చెప్పాడు. నందమూరి బాలకృష్ణ చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తని డైరెక్టర్ క్రిష్ చెప్పిన విషయం తెలిసిందే. దానికి బాలకృష్ణ కూడా పొగిడితే మనదేం పోయింది అనేంత రేంజిలో తలాడించేశాడు. 
 
కానీ. అంతటి శాతకర్ణి కూడా ఒక యువ హీరోయిన్‌ చేతిలో అడ్డంగా బుక్కైపోయాడని సమాచారం. దక్షిణాది హీరో ఇష్టమొచ్చిన సమయంలో షూటింగ్‌కు హాజరవుతూ తనను వడిగాపులు గాచేలా చేశాడంటూ ఆమె చేసిన కామెంట్లు డైరెక్టుగా బాలయ్యను ఉద్దేశించే చేసినవని టాలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు. తన బోల్డ్ స్టేట్‌మెంట్లతో మహమహులకు కూడా వణుకు తెప్పించిన, తెప్పిస్తున్న రాధికా ఆప్టే. 
 
గతంలో కూడా దక్షిణ భారత సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ భామ ఇప్పుడు అదే ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఓ హీరోపై కామెంట్లు చేసింది. ‘ఆ హీరో ఉదయం 9 గంటలకు షూటింగ్ హాజరయ్యేవారు. నేను రెండు గంటల ముందొచ్చి అక్కడ పడిగాపులు కాసేదాన్ని. హీరో హీరోయిన్ల మధ్య ఇలాంటి వివక్ష, తేడాలు దక్షిణ భారత సినీ పరిశ్రమలో తప్ప ఎక్కడా నేను చూడలేదు’ అని ఆరోపించింది. 
 
ఆరోపించెను పో... మళ్లీ దానికి రుజువులను కూడా ఏల చూపించవలె.. చూపించెనుపో... మన బాలయ్య పేరు చెప్పకుండానే అన్యాపదేశంగా చూపుడు వేలు ఆయనమీదే ఎందుకు తిప్పవలె.. తాను చేసిన కామెంటు పలానా సినిమాపై కాదని ఎందుకు ప్రకటించవలె... ఈ వ్యాఖ్యలు పరోక్షంగా బాలయ్యపై చేసినవే అనేది సినీ వర్గాల టాక్.
 
రాధికా ఆప్టే ఎంత తెలివిగా అసలు విషయాన్ని బయటపెట్టిందో చూడండి.  తాను కామెంట్ చేసింది ‘కబాలి’ సినిమాపై కాదని స్పష్టం చేసింది. వాస్తవానికి సౌత్‌లో పెద్ద హీరోలతో రాధికా నటించిన సినిమాలు మూడు. ఒకటి రజినీకాంత్ ‘కబాలి’ కాగా మిగిలినవి బాలకృష్ణ ‘లెజెండ్’, ‘లయన్’. ‘రక్త చరిత్ర’ సినిమాలో రాధికా నటించినప్పటికీ దీనిలో హీరోలు చాలా మందే ఉన్నారు. అలాగే ప్రకాశ్‌రాజ్ ‘ధోనీ’ సినిమాలో నటించినా దీనికి అంత ప్రాధాన్యత లేదు. ‘కబాలి’ కాదని రాధికా ఎలానూ చెప్పింది కాబట్టి ఇక మిగిలింది బాలయ్య సినిమాలే. 
 
చెబితే చెప్పింది కానీ బాలయ్య అభిమానులు ఓ రేంజిలో రాధికాపై చెలరేగిపోతున్నారు. క్రిష్ లాంటి గొప్ప దర్శకుడు బాలయ్య సమయపాలనను మెచ్చుకున్న తరవాత కూడా రాధికా ఈ వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. బాలకృష్ణ సమయానికి షూటింగ్ రాకుండా వివక్ష చూపితే ఆయనతో రెండో సినిమాను ఎందుకు ఒప్పుకున్నావని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయినా బాలకృష్ణ లాంటి సీనియర్ నటుడిపై ఇలాంటి చెత్త కామెంట్లు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇది కచ్చితంగా దక్షిణ భారత సినీ పరిశ్రమపై బురద జల్లడమేనని అంటున్నారు. ఉత్తర భారతంతో పోలిస్తే తమ ఇండస్ట్రీ గొప్పది కాబట్టే రాధికకు అర్థవంతమైన మంచి క్యారెక్టర్లు దక్కాయని, దీన్ని మరిచిపోయి అడ్డదిడ్డమైన కామెంట్లు చేయకూడదని హెచ్చరించారు. ఏదేమైతేనేం రాధికా ఆఫ్టే సినిమాల ద్వారా కాకుండా సంచలన వ్యాఖ్యల వల్లే బాగా పాపులర్ అవుతున్నట్లుంది.
 
మొత్తంమీద బాలయ్య భవిష్యత్తు సినిమాల్లో రాధికా ఆప్టేకు ఛాన్సులుండవు అనేది గౌతమీపుత్ర శాతకర్ణి అంత నిజం.