శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2024 (08:50 IST)

డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి : ఏడు రోజుల పాటు సంతాప దినాలు..

manmohan singh
భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన మృతి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ విషాదానికి గురిచేసింది. మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. శుక్రవారం నుంచి జరగాల్సిన అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గం సమావేశంకానుంది. కాగా, డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. 
 
తెలంగాణాలో ప్రభుత్వ ఆఫీసులకు సెలవు.. 
 
దేశ మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి వృద్దాప్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 92 యేళ్లు. ఆయన మృతి సంతాప సూచకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు సెలవు ప్రకటించింది. దీంతో శుక్రవారం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, శుక్రవారం నుంచి వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం కూడా వారం రోజులు  సంతాప దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత ఢిల్లీలో కేంద్ర మంత్రి మండలి భేటీకానుంది. కాగా, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛలనాలతో నిర్వహించాలని నిర్ణయించారు.