శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

భారతమాత ముద్దుబిడ్డల్లో మన్మోహన్ సింగ్ ఒకరు : రాష్ట్రపతి ముర్ము

Droupadi Murmu
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతమాత ముద్దుబిడ్డల్లో ఒకరిని దేశం కోల్పోయిందని వ్యాఖ్యానించారు. విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నేతల్లో ఈ ఆర్థికవేత్త ఒకరని ఆమె కొనియాడారు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో అరుదైన పాత్రను పోషించారని ద్రౌపది ముర్ము విడుదల చేసిన తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. 
 
దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయ జీవితం, వినయంతో కూడిన నడవడిక చిరస్మరణీయంగా ఉండిపోతాయన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. భరతమాత ముద్దు బిడ్డల్లో ఒకరైన మన్నోహన్ సింగ్‌కు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నట్టు ఆమె చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు, మన్మోహన్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. 
 
మార్గదర్శిని కోల్పోయాను .. రాహుల్ గాంధీ 
కాంగ్రెస్ పార్టీ వృద్ధనేత, భారత దేశ మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త, సంస్కరణల మూలపురుషుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ 92 యేళ్ళ వయసులో కన్నుమూశారు. గురువారం రాత్రి ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ మృతితో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు. మన్మోహన్ మృతితో తాను ఒక గురువును, మార్గదర్శిని కోల్పోయానంటూ విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో మన్మోహన్ సింగ్ అర్థాంగికి, ఇతర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్టు పేర్కొంటూ ఓ ట్వీట్ చేశారు. 
 
మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా దేశాన్ని విశేష పరిజ్ఞానం, సమగ్రతతో నడిపించారని కొనియాడారు. ఆయన మృదు స్వభావం, ఆర్థిక శాస్త్రంపై ఆయనకు లోతైన అవగాహన జాతికి స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. కోట్లాది మంది అభిమానులు ఆయనను అత్యంత గర్వంగా గుర్తుంచుకుంటారని రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
ఏడు రోజుల పాటు సంతాప దినాలు.. 
భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన మృతి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ విషాదానికి గురిచేసింది. మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. శుక్రవారం నుంచి జరగాల్సిన అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గం సమావేశంకానుంది. కాగా, డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది.