శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 22 మే 2021 (16:11 IST)

అన్న‌మ‌య్యకు 24 ఏళ్లు, మళ్లీ అలాంటి సినిమా తీయ‌లేం: దర్శకేంద్రుడు

Annamayya
శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి భ‌క్తుడిగా, ఆయ‌న అంశంగా పుట్టిన‌వాడు అన్న‌మ‌య్య‌. ఆయ‌న కీర్త‌న‌లు వంద‌ల ఏళ్ళుగా జీవంలా వున్నాయి. అలాంటి భ‌క్తుడి సినిమా తీయ‌డానికి కె. రాఘవేంద్ర‌రావు ముందుకు వ‌స్తే క‌థ‌ను జె.కె. భార‌వి ర‌చించారు. అస‌లు ఇలాంటి సినిమా తీస్తే ప్ర‌జ‌లు చూస్తారా! అనే అనుమానం కూడా ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుల‌కు క‌లిగింది. ఇక అన్న‌మ‌య్య పాత్ర‌ధారి నాగార్జున‌కు చెప్ప‌న‌వ‌స‌రంలేదు. ఇది నేను చేయ‌లేను అని ముందే చెప్పారు. అలా చ‌ర్చ‌లు జ‌రిగిన అన్న‌మ‌య్య సినిమా మే22, 1997లో విడుద‌లైంది. నేటికి 24 ఏళ్ళు పూర్తిచేసుకున్న ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు.
 
అనుమ‌తి దొర‌క‌లేదు
అన్నమయ్య కాలంనాటి క‌థ క‌నుక ఆనాటికి సంబంధించిన వాతావ‌ర‌ణంకానీ, దేవాల‌య ప‌రిస్థితికానీ ఇప్పుడు లేవు. అందుకే ముందుగా ఈ సినిమాను తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డును కె. రాఘ‌వేంద్ర‌రావు సంప్ర‌దించారు. కానీ దేవాల‌యంలో చిత్రీక‌ర‌ణ‌కు అనుమ‌తిలేవు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి తీసుకోవాలి. స్వామీజీల నుంచి కూడా ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని అప్ప‌ట్లో అనుకోవ‌డంతో పైపైన కొంత షూట్ చేసి, ఆ త‌ర్వాత అన్నపూర్ణా స్టూడియోలో తిరుమల దేవస్థానం సెట్ ను నిర్మించి అందులో షూటింగ్ చేశారు. తిరుపతి కొండలుగా పశ్చిమ కనుమలను కేరళ రాష్ట్రములో చిత్రీకరించారు.
 
సుమ‌న్ శ్రీ‌వేంక‌టేశ్వ‌రునిగా భానుప్రియ లక్ష్మీ దేవీగా, క‌స్తూరి అలివేలు మంగ‌గా, సాళువ న‌ర‌సింహ‌రాయ‌లుగా మోహ‌న్‌బాబు ఆయ‌న భార్య‌గా రోజా, త‌నికెళ్ళ భ‌ర‌ణి, బాల‌య్య‌, గుండు హ‌నుమంత‌రావు ఇలా ఇత‌ర పాత్ర‌లు పోషించారు.
 
Raghavendra Rao
తొలి పౌరాణికచిత్రం 
15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన అన్నమయ్య చిత్రం. ఈ చిత్రాన్ని చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం శాసనసభ సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడూ అయిన వి.దొరైస్వామి నాయుడు నిర్మించాడు. అన్నమయ్యపై చిత్రాన్ని తీయాలని జంధ్యాలతో పాటు అనేకమంది దర్శకులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆత్రేయ 18 పాటలను కూడా రికార్డు చేయించి స్వయంగా దర్శకత్వం వహించాలని అనుకున్నాడు. కానీ, ఆయన మరణంతో ఆ ఆలోచన అలాగే ఉండిపోయింది. జె.కె.భారవి, రాఘవేంద్రరావుల కృషి ఫలితంగా 1997లో అది సాకారం అయ్యింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తొలి పౌరాణికచిత్రం అన్నమయ్యే. ఈ సినిమాను తమిళంలోకి డబ్బింగు చేసి అన్నమాచారియర్ గానూ, హిందీలోకి డబ్బింగు చేసి తిరుపతి శ్రీ బాలాజీగానూ విడుదల చేశారు.
 
పాటలు
అన్నమయ్య సినిమాలో మొత్తం 41 పాటలు ఉన్నాయి. అందులో చాలామటుకు అన్నమయ్య సంకీర్తనలు కాగా మిగిలినవి సినిమా కోసం వ్రాయబడినవి. యేలే యేలే మరదలా పాటకు ఇంతకుముందు సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని పూసింది పూసింది పున్నాగా అనే ప్రసిద్ధ పాట యొక్క బాణీనే తిరిగి ఉపయోగించారు. సీతారామయ్య గారి మనవరాలు సినిమాకూ నిర్మాత అయిన దొరైస్వామి నాయునికి ఆ బాణీ నచ్చటంతో, దాన్ని తిరిగి అన్నమయ్యలో కూడా ఉపయోగించాలని కీరవాణిని కోరాడు.
 
బాలుతో పాటు సునీత ఇష్ట‌ప‌డి పాడారు
నిగ‌మా నిగ‌మా.నంత వ‌ర్ణిత మ‌నోహ‌ర‌.. రూప ర‌గ‌రాజ‌ద‌రుడ‌ శ్రీ‌నారాయ‌ణ‌..  నారాయ‌ణ వేంక‌ట నారాయ‌ణ‌.. అనే పాట‌ను బాలు, సునీత ఆల‌పించారు. ఆ పాట‌లో అన్న‌మ‌య్య‌తో బంధాలు తెగిపోతాయి.. ఏడిపించి ఏడిపించ‌నీకుయండా. చేసిన‌ ఈ పాట‌..త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని ద‌ర్శ‌కేంద్రుడు చెప్పారు. 
 
రిస్క్‌లు కూడా జ‌రిగాయి
సుమ‌న్‌ను ఎందుకు తీసుకున్నార‌ని చాలా మంది అడిగితే.. ఆయ‌న ముఖం, ముక్కు అనేవి చూడ‌గానే స్వామివారే గుర్తుకు వ‌చ్చారు. స‌హ‌జంగా బాలీవుడ్ నుంచి ఆ పాత్ర‌కు తీసుకువ‌చ్చేవారు. కానీ ఓ రాత్రి శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని గురించి త‌ల‌చుకుంటుండ‌గా వెంట‌నే నా మ‌దిలో సుమ‌న్ గుర్తుకు వ‌చ్చార‌ని వెంట‌నే ఆయ‌న‌కు చెప్పాను. ఆయ‌న మొద‌ట న‌మ్మ‌లేదు. అన్నారు. ఇదే విధంగా నాగార్జున‌కూడా మొద‌ట చేయ‌న‌న్నాడు. ఆ త‌ర్వాత క‌థ విన్నాక‌. ఆయ‌న‌లో తెలీని ఆద్యాత్మిక‌త మొద‌లైంది. అలా అంద‌రూ పాత్ర‌ల ప‌రంగా సెట్ అయ్యారు. ఈ సినిమా చేస్తున్నంత‌సేపు నియ‌మ‌నిష్ట‌ల‌తోనే వున్నారు. ఇవ‌న్నీ ఒక్క‌సారి రాఘ‌వేంద్ర‌రావు గుర్తుచేసుకుంటూ ఇలాంటి సినిమాను మ‌ర‌లా తీయ‌లేం అని పేర్కొన్నారు. ఆ సినిమా వెండితెర‌పై చూశాక‌.. నేనేనా ఈ సినిమా తీసింద‌ని అని ఆయ‌న ఆశ్చ‌ర్య‌పోయారు. 
 
ఇక ఈ సినిమా విడుద‌ల‌య్యాక తిరుమ‌ల‌తిరుప‌తి దేవ‌స్థానం నుంచి ఆయ‌నకు ఆహ్వానం వ‌చ్చింది. ఈ సినిమా విడుద‌ల త‌ర్వాత భ‌క్తులు మ‌రింత పెరిగార‌నీ, వారు అన‌డం.. ఆ త‌ర్వాత దేవ‌స్థానం ఛాన‌ల్‌కు ఆయ‌న హెడ్‌గా వుండ‌డం జ‌రిగిపోయాయి.