రిషి ఇకలేరన్న వార్త విని గుండె పగిలినంత పని అయింది : రజనీ
బాలీవుడ్ సినీ దిగ్గజం రిషి కపూర్ గురువారం ఉదయం కన్నుమూశారు. ఈయనకు వయసు 67 యేళ్లు. శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతూ వచ్చిన ఆయన.. బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతిని బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తన ట్వీట్ ద్వారా ధృవీకరించారు. పైగా, రిషి కపూర్ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రిషి కపూర్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. "గుండె పగిలినంత పని అయింది. నీ ఆత్మకి శాంతి చేకూరాలి నా ప్రియమైన స్నేహితుడా" అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే, మరో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా సంతాపం వ్యక్తం చేశారు.
గొప్ప నటుడే కాదు.. మంచి మనిషి...
బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ హఠాన్మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. రిషీ కపూర్ గొప్ప నటుడు మాత్రమే కాదని, చాలా మంచి మనిషి కూడా అని ఆయన పేర్కొన్నారు. రిషీ కపూర్ మరణం బాలీవుడ్‌కు తీరని లోటని అభిప్రాయపడ్డారు. రిషికపూర్ కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు తాను మనసారా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని జవదేకర్ పేర్కొన్నారు.
సినీ పరిశ్రమకు భయంకరమైన వారం...
ఇదే వారంలో మరో భారతీయ సినిమా నటుడు మరణించడం బాధాకరం. ఒక అద్భుతమైన నటుడు, తరతరాలుగా భారీ అభిమానులని సంపాదించుకున్న ఆయన ఇలా మరణించడం బాధాకరం. అతని కుటుంబానికి, స్నేహితులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు నా సంతాపం తెలియజేస్తున్నాను అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.