శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2020 (19:38 IST)

బీఎండబ్ల్యూ సంస్థ భారత్ సీఈవో హఠాన్మరణం

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన బీఎండబ్ల్యూ సీఈవో (ఇండియా) రుద్రతేజ్ సింగ్ హఠాన్మరణం చెందారు. ఆయనకు సోమవారం ఉదయం అకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చింది. దీంతో తీవ్ర అస్వస్థతకు లోనై ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ సంస్థ తయారు చేసే లగ్జరీ కార్లకు ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కార్లను భారత్‌లో విక్రయించేందుకు, ఆ సంస్థ కార్యకలాపాలను భారత్‌లో నిర్వహించేందుకు వీలుగా రుద్రతేజ్ సింగ్ ఆ కంపెనీ సీఈవోగా గత 2019 ఆగస్టు ఒకటో తేదీన నియమితులయ్యారు. 
 
ఈ హఠాత్పరిణామంపై బీఎండబ్ల్యూ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. భారతదేశం అంతటా డీలర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యలను అమలు చేస్తున్న సమయంలో ఆయన మరణం తమకు తీరనిలోటని ఆ సంస్థ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కష్టకాలంలో కుటుంబంతోపాటు సన్నిహితులకు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చింది. 
 
కాగా, 1996లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చిన్న ఏరియా సేల్స్ మేనేజర్‌గా జీవితం ప్రారంభించిన రుద్ర తేజ్ సింగ్ అంచలంచెలుగా ఎదుగుతూ విజయపథాన్ని నిర్మించుకున్నారు. హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీకి దేశీయంగా, అంతర్జాతీయంగా 16 యేళ్ళ పాటు సుదీర్ఘంగా సేవలు అందించిన ఘనత ఆయనకే దక్కింది.