సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 28 మే 2019 (11:19 IST)

కుమార్తె పెళ్లిలో పాటలు పాడుతూ కుప్పకూలిన ఎస్ఐ...

తన కుమార్తె పెళ్లిని అంగరంగం వైభవంగా చేస్తున్నాడు. ఆ సంతోషంలో పెళ్లి పాటలు కూడా పాడారు. అలా పెళ్లికి వచ్చన ప్రతి ఒక్కరినీ పలుకరించాడు. వారిని ఉల్లాసపరిచేందుకు పెళ్లిపాటలు పాడారు. ఆయన పాడిన పాటలకు స్నేహితులంతా డ్యాన్సులు వేశారు. కానీ, పెళ్లి పాటలు పాడుతూనే వేదికపై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రంలోని కొల్లాం సమీపంలో కర్మనా పోలీస్ స్టేషన్‌లో విష్ణుప్రసాద్ అనే వ్యక్తి ఎస్.ఐగా పని చేస్తున్నాడు. ఈయన తన కుమార్తె పెళ్లిని స్థానికంగా ఓ కళ్యాణ మండపంలో ఘనంగా చేశారు. ఈ పెళ్లికి అతిథులు, ఆహుతులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆయన సంతోషంలో ఉప్పొంగిపోయాడు. 
 
అర్థరాత్రి ముహూర్తం కావడంతో అతిథులను ఉల్లాసపరిచేందుకు సంగీత విభావరి కూడా నిర్వహించారు. ఇందులో ఆయన స్వయంగా పాటలు పాడారు. అలా ఓ పాటపాడుతుండగా వేదికపైనే తూలి కిందపడిపోయి ప్రాణాలు విడిచాడు. పెళ్లికి వచ్చిన వారంతా ఒక్కసారిగా ఈ దృశ్యం చూసి నిశ్చేష్టులైపోయారు. 
 
ఆ తర్వాత విష్ణు ప్రసాద్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనంలేకుండా పోయింది. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. అప్పటివరకు పచ్చని తోరణాలతో కళకళలాడుతున్న పెళ్లిమండపం కాస్త వధువు తండ్రి మరణంతో విషాదంతో స్తబ్దుగా మారిపోయింది.