శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 16 మే 2019 (16:21 IST)

కేరళను ఆలస్యంగా తాకనున్న రుతుపవనాలు

ఈ యేడాది నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని ఆలస్యంగా తాకనున్నాయి. ముందుగా అంచనావేసిన ప్రకారం జూన్ ఒకటో తేదీనే ఈ రతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించాల్సివుంది. అయితే, నాలుగు రోజులు అటూఇటుగా ప్రవేశించనున్నాయి. అంటే జూన్ ఆరో తేదీన ఈ రుతుపవనాలు తాకొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అంటే జూన్ 2 నుంచి 10వ తేదీలోపు అటూఇటుగా తాకొచ్చని పేర్కొంది. 
 
సాధారణంగా జూన్ ఒకటో తేదీనాటికి రుతపవనాలు కేరళను తాకాల్సి వుంది. అయితే, మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ యేడాది జూన్ ఆరో తేదీ వరకు కేరళను తాకే అవకాశం లేదని ఐఎండీ బుధవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. నైరుతి రుతుపవనాల కాలం జూన్ నుంచి సెప్టెంబరు వరకు ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాంతాల్లో విస్తారంగాను, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతూ వస్తుంది. 
 
పంటలపై ప్రభావం చూపే నైరుతి రుతుపవనాలపైనే దేశ ఆర్థిక పరిస్థితి ముడిపడివుంటుంది. అందువల్లే ఈ రుతుపవనాలకు అమితమై ప్రాధాన్యత ఉంటుంది. కాగా, మే 10వ తేదీ తర్వాత కేరళ, లక్ష్యద్వీప్‌లలో ఉన్న 14 వాతావరణ కేంద్రాల్లో 60 శాతం కేంద్రాల్లో 2 రోజుల పాటు 2.50 మిల్లీమటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అయితే, అండమాన్ నికోబార్  దీవుల్లో మాత్రం నైరుతి రుతుపవనాలు మే 18 నుంచి 19 తేదీల్లో ప్రవేశించవ్చని పేర్కొంది. 
 
ఇకపోతే, ఈ యేడాది కూడా రుతుపవనాలు ఆలస్యమైతే, 2014 నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు వాటి రాక ఆలస్యమైనట్టు అవుతుంది. 2014లో జూన్ 6న, 2015లో జూన్ 5న, 2016లో జూన్ 8న, 2017లో మే 30న, 2018లో మే 29వ తేదీ రుతుపవనాలు మన దేశంలోకి ప్రవేశించాయి. 
 
అయితే రుతుపవనాలరాక ఆలస్యమైనంత మాత్రాన మొత్తం వర్షపాతంపై ప్రభావం చూపకపోవచ్చు. గతేడాది మూడ్రోజులు ముందుగానే (మే 29న) రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. అయినప్పటికీ సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది. 2017లోనూ ఇలానే జరిగింది. మే 30న రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, దీర్ఘకాల సగటు (ఎల్పీఏ)లో 95 శాతం (సాధారణం కంటే తక్కువ) వర్షపాతమే నమోదైంది. 
 
ఈ యేడాది దాదాపు సాధారణ వర్షాలే కురుస్తాయని ఏప్రిల్‌లో విడుదల చేసిన తొలి విడత అంచనాల్లో ఐఎండీ పేర్కొంది. ఎల్పీఏలో 96 శాతం (సాధారణం, సాధారణం కంటే తక్కువ కేటగిరీలకు దరిదాపుల్లో) వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా వేసింది. మరోవైపు స్కైమెట్ మాత్రం ఈ ఏడాది ఎల్పీఏలో 93 శాతం (సాధారణం కంటే తక్కువ) వర్షపాతం కురవొచ్చని అంచనా వేయడం గమనార్హం.